
మహిళలతో మాట్లాడుతున్న కలెక్టర్ కర్ణన్
కరీంనగర్‌టౌన్: ఏకాగ్రతను దెబ్బతీస్తూ నీరసం, ఇతర అనారోగ్య సమస్యలకు కారణమయ్యే రక్తహీనతను ప్రతి మహిళా జయించాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ అన్నారు. కరీంనగర్‌లోని బుట్టిరాజారాం కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. అక్కడికి వచ్చిన మహిళలతో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితి గురించి, కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలు, పరీక్షల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే మహిళల కోసం ప్రత్యేకంగా ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. ప్రతీ మంగళవారం మహిళలకు 8 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడంతోపాటు మందులు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మహిళా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యాధి తీవ్రతను బట్టి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి పంపించి, మెరుగైన వైద్యం అందించనున్నట్లు పేర్కొన్నారు. అందరూ రక్తహీనత పరీక్షలు నిర్వహించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ శ్రీలతారెడ్డి, పీడీ మెప్మా రవీందర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతీ పరీక్షకు సిద్ధం కావాలి
కరీంనగర్ కల్చరల్: జిల్లా గ్రంథాలయంలో షెడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి, ఏప్రిల్ 14న ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయాన్ని ఆయన సందర్శించారు. వివిధ పోటీ పరీక్షల కోసం స్థానిక, ఇతర జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. వారధి మొబైల్ యాప్‌ను అందరూ వినియోగించుకోవాలని అ న్నారు. ఇందులో వివిధ పరీక్షలకు ఉపయోగపడే మెటీరియల్ అందుబాటులో ఉందని తెలిపారు. అంతేకాకుండా ఆన్‌లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించి, వాటి ఫలితాన్ని కూడా వెనువెంటనే అందించేలా యాప్‌ను రూపొందించినట్లు చెప్పారు. ప్రైవేటు ఉద్యోగాలు సాధించేందుకూ ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. లైబ్రరీలో వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తానని అన్నారు. అభ్యర్థులు ఏదో ఒక్క పరీక్షకు మాత్రమే కాకుండా ప్రతీ పరీక్షకు సిద్ధం కావాలని సూచించారు. వేసవి దృష్ట్యా లైబ్రరీలో మంచి నీరు, ఏసీ, కూలర్లను ఏర్పాటు చేస్తామని చెప్పా రు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ పొన్నం అని ల్, సెక్రటరీ సరిత, సిబ్బంది తదితరులున్నారు.
ఆధార్ నవీకరణపై అవగాహన కల్పించండి
కరీంనగర్ అర్బన్: ఆధార్ నవీకరణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆధార్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు డీపీవో, ఎంపీడీవోలు, తహసీల్దార్లు కృషి చేయాలన్నారు. ఐదేళ్లు దాటిన పిల్లలకు బయోమెట్రిక్, ఇదివరకే ఆధార్ కార్డు పొందినవారు పదేళ్లకోసారి అప్‌డెట్ చేసుకునేలా చూడాలని పేర్కొన్నారు. జిల్లాలో జనాభా ప్రాతిపదికన 100 శాతం ఆధార్ నమోదు చేసేందుకు అవసరం మేర ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రాల నిర్వాహకులు ప్రజల నుంచి అధిక వసూళ్లకు పాల్పడకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చంద్రమెహన్, యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ రాజ్‌కుమార్, ప్రాజెక్టు మేనేజర్ అపిల్, డిడబ్ల్యూవో బితా కుమారి, డీఈవో జనార్దన్‌రావు, ఎల్‌డీఎం ఆంజనేయులు, డీపీవో వీరబుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్