మహిళలు ఆర్థికంగా ఎదగాలి

- - Sakshi

కోల్‌సిటీ: మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా కార్పొరేషన్‌ కార్యాలయంలో శనివారం మెప్మా ఆధ్వర్యంలో వేస్ట్‌ టు వెల్త్‌పై అవగాహన కల్పించారు. తడి చెత్త నుంచి కంపోస్ట్‌ ఎరువు తయారు చేసుకుని కిచెన్‌గార్డెన్‌, రూఫ్‌ గార్డెన్‌తో కూరగాయలు, పూల మొక్కల ద్వారా ఆదాయం పొందుతున్న స్వశక్తి మహిళలను అభినందించారు. కంపోస్ట్‌ తయారీకి సిమెంట్‌ గాజులు ఉచితంగా అందిస్తానని తెలిపారు. గౌతమినగర్‌లో డ్రై రిసోర్స్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న స్వశక్తి మహిళ బిజిలీ విజయను అభినందించారు. ముందస్తు వైద్య పరీక్షలు చేసుకుంటూ.. క్రమం తప్పకుండా మందులు వేసుకుంటూ వ్యాధుల బారిన పడకుండా ఉండాలన్నారు. ఇందుకు ప్రతి రెండు నెలలకోసారి ప్రభుత్వ వైద్య కళాశాలలో స్వశక్తి మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు, మందులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నగర మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. హోం కంపోస్టింగ్‌, కిచెన్‌ గార్డెన్‌తో పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని, ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు పండిచుకోవచ్చని సూచించారు. మున్సిపల్‌ కమిషనర్‌ బి.సుమన్‌రావు మాట్లాడుతూ.. స్వచ్ఛతలో మహిళలు నుంచి మహిళల నాయకత్వంలో స్వచ్ఛత వరకు పరివర్తన జరిగిన నేపథ్యంలో స్వచ్ఛోత్సవ్‌–2023 పేరిట ఈ నెల 30 వరకు ప్రచారం చేస్తామన్నారు. శానిటేషన్‌, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో మహిళలను గుర్తించి విన్స్‌ (విమెన్‌ ఐకాన్‌ లీడింగ్‌ స్వచ్ఛత) అవార్డు ఇస్తామన్నారు. ఇందుకు మహిళా పారిశ్రామికవేత్తలు, స్వశక్తి మహిళలు, ఎన్‌జీఓ, స్టార్టప్‌, సూక్ష్మ పరిశ్రమల నిర్వాహకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, గడువులోగా వచ్చిన దరఖాస్తుల్లో ఐదు నామినేషన్లను జాతీయస్థాయి పురస్కారం నిమిత్తం ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. కమ్యూనిటీ పబ్లిక్‌ టాయిలెట్ల నిర్వహణ, సెప్టిక్‌ ట్యాంకుల శుభ్రపరిచే సేవలు, మురుగు నీటిశుద్ధి, మున్సిపల్‌ చెత్త సేకరణ, తరలింపు, మెటీరియల్‌ రికవరీ ఫెసిలిటీ కేంద్రాలు, చెత్త నుంచి సంపద సృష్టించే ఉత్పత్తులు, ఘన వ్యర్థ పదార్థాల శుద్ధి సౌకర్యాలు, ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌, ఎడ్యుకేషన్‌, సామర్థ్య నిర్మాణం, టెక్నాలజీ– ఇన్నోవేషన్‌ తదితర అంశాలలో గుర్తింపు పొందిన వారిని అవార్డుకు ఎంపిక చేస్తామన్నారు. అనంతరం మహిళలందరితో కేక్‌ కట్‌ చేయించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి

రెండు నెలలకోసారి

ఉచిత వైద్య పరీక్షలు

తడి చెత్తతో కంపోస్టు తయారీ

అభినందనీయం

వేస్ట్‌ టు వెల్త్‌ అవగాహనలో

రామగుండం ఎమ్మెల్యే చందర్‌

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top