● పొలంలో వేసుకుంటే భూసారం పెరుగుతుందంటున్న శాస్త్రవేత్తలు
● తద్వారా పంట దిగుబడి
పెరిగే అవకాశం
నందిపేట్ (ఆర్మూర్): వచ్చే నెలలో వానాకాలం సాగు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్నదాతలు పంట చేలను సారవంతం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. ఏటా మూడు పంటలు పండిస్తుండటంతో నేల తనలోని సారం కోల్పోతుంది. భూసారం కోల్పోతే పంటల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. పంటల రోగ నిరోధక శక్తి తగ్గడంతో చీడపీడలు ఆశించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గ్రామాల్లోని చెరువులు, కుంటలలో నీళ్లు అడుగంటడంతో ఉపాధిహామీ పథకం కింద పూడికతీత పనులు చేపడుతున్నారు. తద్వారా చెరువులు, కుంటల్లో నీటినిల్వలు పెరడంతోపాటు చెరువు (నల్ల) మట్టిని వ్యవసాయ భూములకు తరలించవచ్చు. పూడిక తీసిన చెరువు మట్టిని భూమిలో పోసుకుంటే భూసారం పెరుగుతుందని వ్యవసాయాధికారులు గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. దీంతో రైతులు కొంత చెల్లించి చెరువులతో పాటు గోదావరి పరివాహక ప్రాంతం నుంచి నల్లమట్టిని ట్రాక్టర్ల ద్వారా తమ చేన్లలో పోసి తరలించుకుంటున్నారు.
లాభాలు ఇవే..
● చెరువు మట్టిలో ఒండ్రు, బంక మట్టితోపాటు పంటలకు అవసరమయ్యే నత్రజని, భాస్వరం, పోటాష్‌తో పాటు ఇతర సూక్ష్మ పోషకాలు ఉంటాయి.
● చేనులో చెరువు మట్టిని పోసుకొని చేనంతా చల్లుకోవడం ద్వారా నేలకు అన్ని పోషకాలు అందుతాయి. దీంతో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది.
● నల్లమట్టిలో సేంద్రియ కర్బనం, సూక్ష్మ పోషక మూలకాలు అధికంగా ఉంటాయి. దీంతో మొక్కలు రోగనిరోధక శక్తిని కల్గి ఉంటాయి.
● రసాయన ఎరువులకు బదులు నల్లమట్టిని వినియోగించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గి దిగుబడులు పెరుగుతాయి.


