కామారెడ్డి క్రైం: నేరస్తులకు శిక్ష పడేలా సాక్ష్యాధారాలను సేకరించాలని ఎస్పీ రాజేశ్ చంద్ర పోలీసు అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో దొంగతనాలు, దోపిడీలు, దారి దోపిడీలు లాంటి గ్యాంగ్ ఫైల్స్ నేరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో గతంలో నేరాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాల కేసులు, సాక్ష్యాధారాల సేకరణ వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి నేరస్తుడి వివరాలను పకడ్బందీగా సిద్ధం చేసి, వారిపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. పెండింగ్ కేసుల్లో విచారణ వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో నేరాల నియంత్రణకు ఆపరేషన్ కవచ్‌ను మరింత బలోపేతం చేయాలన్నారు. రాత్రిపూట గస్తీని పెంచాలని సూచించారు. సమావేశంలో కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్‌రావు, విఠల్‌రెడ్డి, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, రైటర్లు పాల్గొన్నారు.


