కార్పొరేట్‌కు దీటుగా కేజీబీవీలు! | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌కు దీటుగా కేజీబీవీలు!

Mar 16 2026 7:30 AM | Updated on Mar 16 2026 7:30 AM

రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తాం

కామారెడ్డి టౌన్‌ : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)ను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దడానికి సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జిల్లాకు మూడు చొప్పున కేజీబీవీలను యంగ్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (వైఐఐవోఈ)లుగా మార్చింది. ఈ నేపథ్యంలో వాటిలో ఇంటర్‌ ప్రవేశాలకోసం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. సోమవారం నుంచి ఏప్రిల్‌ 15వ తేదీ వరకు www.tgrjc.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మే 5న పరీక్ష నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రతిభావంతులకు ఆయా విద్యాలయాల్లో అవకాశం కల్పిస్తారు. వీటిలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌ విద్యార్థినులకు సాధారణ విద్యా బోధనతో పాటు జేఈఈ, నీట్‌, క్లాట్‌ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు నిపుణులైన అధ్యాపకులతో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

రాత పరీక్ష ద్వారా ఎంపిక

ఈ ఎక్స్‌లెన్స్‌ సెంటర్లలో ప్రవేశం కోసం ప్రత్యేక రాత పరీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థినులు దీనికి అర్హులు. అర్హత సాధించిన వారికి ఉచితంగా వసతితో పాటు నాణ్యమైన శిక్షణ, స్టడీ మెటీరియల్‌ అందిస్తారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నగరాలకు వెళ్లి కోచింగ్‌ తీసుకోలేని పేద విద్యార్థినులకు ఈ నిర్ణయం గొప్ప వరమని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ప్రత్యేక కోర్సులు..

జిల్లాలో మొత్తం 19 కేజీబీవీలు ఉండగా ప్రస్తు తం 13 చోట్ల ఇంటర్మీడియట్‌ విద్య అందుబాటులో ఉంది. అయితే వీటిలో విద్యార్థినుల ఆసక్తి, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మూడు కేజీబీవీలను స్పెషల్‌ కోచింగ్‌ సెంటర్లుగా తీర్చిదిద్దనుంది. కేజీబీవీ భిక్కనూరులో జేఈఈ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. లింగంపేటలో వైద్య విద్యను లక్ష్యంగా పెట్టుకున్న వారి కోసం నీట్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. నిజాంసాగర్‌లో న్యాయ విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థినుల కోసం కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌(క్లాట్‌)కు కోచింగ్‌ ఇస్తారు.

ప్రభుత్వం జిల్లాలోని భిక్కనూరు, లింగంపేట, నిజాంసాగర్‌ కేజీబీవీలను సీవోఈ ఎక్స్‌లెన్స్‌గా ఎంపిక చేసింది. వీటిలో జేఈఈ, నీట్‌, లాసెట్‌ తదితర ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. రాత పరీక్షల ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

– బి.సుకన్య,

కేజీబీవీ సెక్టోరియల్‌

అధికారి, కామారెడ్డి

‘ఎక్స్‌లెన్స్‌’కు జిల్లాలో

మూడు పాఠశాలల ఎంపిక

జేఈఈ, నీట్‌, క్లాట్‌ వంటి

పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ

నేటి నుంచి ఏప్రిల్‌ 15 వరకు

దరఖాస్తుల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement