ఓటేయలేదు!
ఏకగ్రీవాలూ తగ్గాయి...
జిల్లాలో ఓటింగ్ వివరాలు ఇలా..
లక్ష మంది
● పంచాయతీ ఎన్నికల్లో
తగ్గిన పోలింగ్ శాతం
● పల్లెపోరులోనూ తగ్గుతున్న ఆసక్తి
● ఎన్నికలంటే విరక్తి చెందుతున్నారా?
జిల్లాలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సుమారు లక్ష మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. అలాగే గత ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌శాతం కన్నా ఈసారి పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించగా, ప్రతి విడతలోనూ గతంలో జరిగిన పోలింగ్ కంటే తక్కువగా నమోదైంది.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ‘స్థానిక’ ఎన్నికల్లో హోరాహోరీగా తలబడే అభ్యర్థులు ఓటర్లను పోలింగ్ కేంద్రానికి రప్పించి, తమకు ఓటేయించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఎక్కడెక్కడో ఉన్నవారికి ఫోన్లు చేసి అవసరమైతే వారికి ప్రత్యేక వాహనాలు సమకూర్చి మరీ రప్పిస్తుంటారు. అందువల్లే సార్వత్రిక ఎన్నికల కన్నా స్థానిక ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదవుతుంది. అయితే ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితులు కనబడ్డాయి. జిల్లాలో ఇటీవల మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ శాతం గతంలో కన్నా తగ్గింది. కొన్ని గ్రామాల్లో మాత్రమే పోటీలో ఉన్నవారు ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో వలసవెళ్లిన వారిని రప్పించి ఓట్లేయించారు. అయితే దూరాన ఉన్న వారిని రప్పించిన తర్వాత వాళ్లకు పెట్టే ఖర్చు ఏమోగానీ, ఓట్లేస్తారో లేదోనన్న భయంతో చాలా గ్రామాల్లో వలస వెళ్లిన వారిపై పెద్దగా శ్రద్ధ చూపలేదు. కొందరు ఓటు వేయాలన్న ఉద్దేశంతో సొంతంగా వచ్చి ఓటేసి వెళ్లారే తప్ప చాలా చోట్ల వారిని అభ్యర్థులు పట్టించుకున్నపాపాన పోలేదు. హోరాహోరీగా పోరు సాగిన గ్రామాల్లో మాత్రం ఓటర్లను కేంద్రాలకు చేర్చే ప్రయత్నం చేశారు. జిల్లాలో 532 పంచాయతీలు ఉండగా 6,39,730 మంది ఓటర్లున్నారు. అయితే 81 గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం కావడంతో 451 పంచాయతీలకు ఈ నెల 11, 14, 17 తేదీలలో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన గ్రామాల్లో 5,97,509 మంది ఓటర్లు ఉండగా, 4,97,861 మంది ఓటు వేశారు. ఓటు వేయని వారు 99,648 మంది అంటే దాదాపు లక్ష మంది ఓటు వేయడానికి ఆసక్తి చూపలేదని స్పష్టమవుతోంది.
జిల్లాలో 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం కన్నా, ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. అప్పుడు తొలి విడతలో 81.29శాతం మంది ఓట్లు వేయగా, ఈసారి తొలి విడతలో 79.40 శాతం ఓట్లు పోలయ్యాయి. అప్పుడు రెండో విడతలో 90.04 శాతం పోలవగా, ఇప్పుడు 86.08 శాతం, అప్పుడు మూడో విడతలో 86.97 శాతం ఓట్లు పోలైతే ఈసారి 85.95 శాతం ఓట్లు పోలయ్యాయి. మూడు విడతల్లోనూ పోలింగ్ శాతం తగ్గిందనేది స్పష్టమవుతోంది. అప్పుడు జిల్లాలో సరాసరిగా 86.10 శాతం పోలింగ్ నమోదైతే, ఈసారి 83.81 శాతం పోలైంది. అప్పటికీ ఇప్పటికీ పోలింగ్ శాతం తగ్గుతుండడాన్ని పరిశీలిస్తే ప్రజల్లో ఓటింగ్‌పై ఆసక్తి తగ్గుతోందని స్పష్టమవుతోంది.
ఎన్నికల గోల వద్దనుకొని అప్పట్లో చాలా చోట్ల ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ఆసక్తి చూపేవారు. ప్రధానంగా చిన్న పంచాయతీల్లో ఏకగ్రీవాలు ఎక్కువగా జరుగుతుండేవి. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 119 చోట్ల గ్రామ పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసారి ఏకగ్రీవాల సంఖ్య 81 మాత్రమే. అంటే గతంలో కన్నా 38 పంచాయతీలు తగ్గాయి. గతంలో ఏకగ్రీవ పంచాయతీలకు నజరానా ఇచ్చేవారు. అయితే గత విడతలో ఏకగ్రీవాలకు నజరానా ఇవ్వకపోవడం కూడా ఏకగ్రీవాలు తగ్గడానికి కారణమైందని భావిస్తున్నారు.
విడత మొత్తం ఓట్లు పోలైన ఓట్లు ఓటు వేయనివారు
ఒకటో విడత 2,42,913 1,92,870 50,043
రెండో విడత 1,64,301 1,41,424 22,877
మూడో విడత 1,90,295 1,63,567 26,728
మొత్తం 5,97,509 4,97,861 99,648


