‘కొడుకును సూడక ఇరవై ఐదేళ్లాయె...’
● అవ్వ సచ్చిపోయినా ఇంటికి రాలేడు
● పోలీసులకు దొరికిండ్రని అంటుండ్రు
● ఇప్పుడన్నా ఇంటికి పంపుండ్రి సారూ...
● ఎర్రగొల్ల రవి తండ్రి రామయ్య వేడుకోలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ‘సదువుకునేతందుకు కామారెడ్డికి పోయిన కొడుకు ఇంటికి రాలేదు. కొడుకు కోసం తిరగని జాగ లేదు. కొన్ని దినాలకు అన్నలల్ల పోయిండని తెలిసింది. రావాలని కోరుకున్నం గని కొడుకు దూరాన పోయిండన్నరు. మాకు పత్తా తెల్వదు. ఇరువై ఐదేండ్లాయె. పోయిండంటే ఇంటికి తిరిగి రాలేదు. నిన్నమొన్న పోలీసులకు దొరికిండని అంటున్నరు. కొడుకు ఎట్లున్నడో ఏమో. ఇప్పుడన్న ఇంటికి వస్తె మంచిగ ఉంటది’ అని పాల్వంచ మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు ఎర్రగొల్ల రవి తండ్రి రామయ్య వేడుకుంటున్నాడు. గత సోమవారం రవితోపాటు మరికొందరు నక్సల్స్ ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసులకు చిక్కినట్టు పత్రికల్లో రావడంతో రవి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా రవి తండ్రి రామయ్యతోపాటు కుటుంబ సభ్యులు ‘సాక్షి’తో మాట్లాడా రు. రవి నక్సలైట్లలో కలిసిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇంటి ముఖం చూడలేదని ఆయన తండ్రి రామయ్య పేర్కొన్నారు. కొడుకు కోసం తల్లి ఎంతో మనాది పడిందని, ఆమె చనిపోయినా కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కొడుకు రావాలని కోరుకున్నామని, ఇప్పటి దాకా ఇంటికి రాలేదని తెలిపారు. ఇప్పుడైనా కొడుకు వస్తే బాగుంటుందని పేర్కొన్నారు. కొడుకు రాక కోసం ఎదురుచూస్తుంటానని తెలిపారు. ఎవరినీ ఇబ్బంది పెట్టినోడు కాదని, అప్పుడు తెలిసో తెలియకో అన్నలల్ల పోయిండన్నారు. ఇరువై ఐదేండ్లుగా కొడుకు కోసం ఎదురుచూసిన తల్లి చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా వచ్చి ఇంటి దగ్గర అందరితో కలిసి ఉండాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు.


