థైరాయిడ్ పరీక్షలకు తాళం
నిత్యం 40 నుంచి 60 మందికి పరీక్షలు..
కామారెడ్డి టౌన్: జిల్లాలో ప్రభుత్వ డయాగ్నోస్టిక్స్ (టీ హబ్)లో థైరాయిడ్ పరీక్షలు నిలిచిపోయాయి. నాలుగు నెలలుగా ప్రభుత్వం నుంచి థైరాయిడ్ పరీక్షలకు కావాల్సిన కిట్లు సరఫరా నిలిచిపోవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీంతో థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి రోగులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. సకాలంలో పరీక్షలు చేయించుకోలేక సరైన వైద్యం పొందలేకపోతున్నారు.
నాలుగు నెలలుగా ఇబ్బందులు..
జిల్లా కేంద్రంలో దేవునిపల్లి వద్ద తెలంగాణ డయాగ్నోస్టిక్స్ టీ హబ్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేశారు. జిల్లాలోని పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులు, జీజీహెచ్‌లకు ఈ ల్యాబ్ అనుసంధానంగా ఉంటుంది. 31 ప్రభుత్వ ఆస్పత్రులలో సేకరించిన రక్త తదితర పరీక్షల శాంపిల్స్‌కు టీ హబ్‌లో పరీక్షలు నిర్వహించి రిపోర్టులను రోగులకు ఉచితంగానే అందజేస్తారు. అయితే, నాలుగు నెలలుగా కిట్లు సరఫరా లేకపోవడంతో థైరాయిడ్ పరీక్షలు నిలిచిపోయాయి. థైరాయిడ్‌లో టీఎస్‌హెచ్(థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్), టీ3, టీ4 పరీక్షలు చేస్తారు. థైరాయిడ్ పరీక్ష ప్రైవేట్ ల్యాబ్‌లో చేయించుకుంటే రూ. 2వేల వరకు వసూలు చేస్తున్నారు. దీర్ఘకాలికంగా థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ రెగ్యులర్‌గా పరీక్షలు చేయించుకోవాల్సిన రోగులు, బాధితులు ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులలో థైరాయిడ్ బాధితులు, వ్యాధిగ్రస్తుల నుంచి నిత్యం 40 నుంచి 60 మంది రక్త నమూనాలను సేకరించి టీ హబ్‌కు పంపుతున్నట్లు అధికారుల గణాంకాల్లో వెల్లడైంది. ప్రతి నెల 1200 నుంచి 1800 పరీక్షలు చేస్తున్నారు. నాలుగు నెలలుగా ఈ పరీక్షలు నిలిచిపోయాయి. ఈ విషయమై ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లును ‘సాక్షి’ వివరణ కోరగా వారం రోజుల్లో థైరాయిడ్ కిట్లు ప్రభుత్వం నుంచి సరఫరా అవుతాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కిట్ల సమస్య ఉన్నట్లు వివరించారు.
టీ హబ్‌లో నిలిచిన టెస్టులు
నాలుగు నెలలుగా కిట్ల కొరత,
రోగుల అవస్థలు
ప్రైవేట్ ల్యాబ్‌లను
ఆశ్రయిస్తున్న బాధితులు


