నిబంధనల్లో మార్పులు
చలాన్లు వెంటనే కట్టుకోవాలి
బిచ్కుంద: రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ఇంటికి వెళ్లాలని పొలీస్ అధికారులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహదారులకు పొలీసులు చలాన్(జరిమానా)విధిస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలలో ఉదయం, సాయంత్రం పొలీసులు వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే ఒక్క ఫోటో క్లిక్‌తో భారీ జరిమానా పడుతుంది. ఎన్ని జరిమానాలు ఉన్నా వాహనదారులు చెల్లించకుండా అలాగే వాహనంపై తిరుగుతున్నారు. చలాన్‌లు ఉండి తిరగడానికి ఇప్పటి నుంచి వీలు లేదని కేంద్ర రవాణా శాఖ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వెంటనే అమలు చేయాలని పొలీస్ అధికారులను ఆదేశించారు. కొత్త నిబఽంధనల ప్రకారం 5 చలాన్లకు మించి ఉండరాదు. 45 రోజుల వ్యవధిలో చలాన్లు చెల్లించాలి. లేకుంటే డ్రైవింగ్ లైసెన్సు రద్దుతో పాటు వాహనం జప్తు చేసే అధికారం పోలీస్ అధికారులకు ఉంది.
వెనక్కి తీసుకోవాలని డిమాండ్
చలాన్లు చెల్లించని వారిపై ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకుంది. వాహనాలు జప్తు చేయడం, లైసెన్సు రద్దుకు అవకాశ కల్పించడం వంటి కొత్త రూల్స్ ప్రభుత్వం రూపొందించడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. హెల్మెట్ లేకున్నా పొలీసులు వాహనాల తనిఖీల్లో రన్నింగ్‌లో ఉన్న వాహనాల వెనక నుంచి ఫోటోలు తీసి వాహనదారులకు తెలియకుండా చలాన్లు వేస్తున్నారు. ఎక్కడ తప్పు చేయకున్నా జరిమానా విధించడం ఎంతవరకు సమంజసమని వాహనదారులు ఇప్పటికే గగ్గోలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు కొత్త నిబంధనలతో వాహనదారులను వేధించడం తప్ప ఏమీ లేదని అంటున్నారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర రవాణ శాఖ వెనక్కి తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
కఠినంగా వ్యవహరిస్తున్న పొలీసులు...
అన్ని రకాల చిన్న పెద్ద వాహనాలు నడిపే వారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పొలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. హెల్మెట్, లైసెన్సు, ఇన్సూరెన్స్, ట్యాక్స్, పర్మిట్ ఇతర పత్రాలు అన్నీ ఉండాలి లేకుంటే జరిమానా విధిస్తున్నారు. ఆన్‌లైన్‌లో వాహనం నెంబరు పరిశీలించి చలాన్ ఉంటే చెల్లించాలని సూచిస్తున్నారు. చెల్లించే వరకు వాహనాన్ని పంపించడం లేదు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫోటోలు తీసి చలానా విధిస్తున్నారు. కొందరు ద్విచక్ర వాహనదారులు నెంబరు ప్లేట్ లేకుండానే తిరుగుతున్నారు. మరి కొందరు తప్పుడు నెంబర్ ప్లేట్, ఇతర వాహనాల నెంబర్లను బిగించుకుంటున్నారు. పోలీసుల చలాన్లు అసలైన వాహనదారులకు మెసేజ్ వెళ్తుండడంతో వారు కంగుతింటున్నారు. దొంగ నెంబర్ ప్లేట్ల ఆటకట్టించేందుకు పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు.
వాహనాలపై ఉన్న చలాన్లు వెంటనే కట్టుకోవాలి. రవాణా శాఖ కొత్త రూల్స్ ప్రకారం చలాన్లు ఉంచుకోవద్దు. లైసెన్సు రద్దు, పొలీసులు వాహనం స్వాదీనం చేసుకునే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించి చలాన్లు పడకుండా చూసుకోవాలి. మైనర్లు వాహనాలు నడపొద్దు. తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తాం.
– మోహన్‌రెడ్డి, ఎస్సై, బిచ్కుంద
చలాన్లు ఐదు కంటే ఎక్కువ
పెండింగ్‌లో ఉంటే లైసెన్సు రద్దు
కొత్త నిబంధనలతో
వాహనదారుల్లో ఆందోళన
45 రోజుల్లో చెల్లించకుంటే
వాహనం జప్తు
నిబంధనల్లో మార్పులు


