
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
● రెండు రోజుల్లో పరిహారం అందించాలి
● లేకపోతే బీసీ సభను అడ్డుకుంటాం
● మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
ఎల్లారెడ్డి: భారీ వర్షాలు, వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకు రెండు రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. లేకపోతే ఈనెల 15న కామారెడ్డిలో నిర్వహించే బీసీ సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. బుధవారం ఎల్లారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన పర్యటన రైతులను పరామర్శించడానికి వచ్చినట్లుగా కాకుండా విహారయాత్రకు వచ్చివెళ్లినట్లుగా సాగిందని విమర్శించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి మొదటిసారి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. రూ. వంద కోట్లతో కూడిన ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారనుకుంటే పది రూపాయలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. పంట నష్టపోయిన రైతుకు ఎకరానికి లక్ష రూపాయల చొప్పున పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సంబంధించిన బోర్ మోటార్లు వరదలో కొట్టుకుపోయాయని, వారికి వెంటనే ప్రభుత్వం కొత్త మోటార్లు అందజేయాలని కోరారు. బీసీల విషయంలో చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీ.. ఓట్ల కోసమే బీసీ సభ పేరిట కొత్త నాటకానికి తెరతీసిందని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు జలందర్‌రెడ్డి, సతీష్, ముదాం సాయిలు, కపిల్ రెడ్డి, నర్సింలు, సతీష్, ఇమ్రాన్, అరవింద్ గౌడ్, పృథ్వీరాజ్, గంగారెడ్డి, మనోజ్, బర్కత్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.