
కుక్కల దాడిలో చిన్నారికి గాయాలు
రుద్రూర్ : ఆరుబయట ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేసి గాయపర్చిన ఘటన మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉ న్నాయి. మహతాజ్ అనే చిన్నారి ఆరు బయట ఆడుకుంటుండగా కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. గాయ పడిన మహతాజ్‌ను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
చోరీ కేసులో ఒకరి అరెస్టు
భిక్కనూరు: చోరీ కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు శనివారం తెలిపారు. మండల కేంద్రానికి చెందిన దుబ్బాక సుజాత ఇంట్లో బంగారు కమ్మలు, రెండు జతల పట్టగొలుసులు, కర్నాల నర్సవ్వ ఇంట్లో నుంచి ఒక జత వెండి పట్టగొలుసులను శుక్రవారం దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి చోరీకి పాల్పడిన కర్నాల రేణుకను అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద బంగారు కమ్మలు, వెండి పట్టగొలుసులు స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
పేకాడుతున్న 8 మంది అరెస్టు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ మురళి తెలిపారు. పేకాట ఆడుతున్న వారి నుంచి రూ. 6450 నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గ్రామాలలో పేకాట ఆడితే కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు.
పెద్దపులి జాడ కోసం గాలింపు
సిరికొండ: పెద్దపులి జాడ కోసం అటవీశాఖ అధికారు లు గాలింపు ముమ్మరం చే శారు. పాదముద్రలు లభ్యమైన చెరువుల పైభాగాన గల జినిగ్యాల అటవీ ప్రాంతంలో యానిమల్ ట్రాకర్స్ బృందం సభ్యులు, సిరికొండ రేంజ్ సిబ్బంది శనివారం గాలించినట్లు ఎఫ్‌ఆర్‌వో రవీందర్ తెలిపారు. మరెక్కడా పెద్దపులి అడుగులు కనిపించలేదని పేర్కొన్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న చీమన్‌పల్లి, పందిమడుగు, తెల్లపలుగు తండా, జినిగ్యాల తండాలలో అధికారులు అవగాహన కల్పించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీఆర్వో గంగారం, పందిమడుగు సెక్షన్ అధికారి సాయికిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.

కుక్కల దాడిలో చిన్నారికి గాయాలు