
పోలీస్ కావడమే లక్ష్యం
● అరుదైన వ్యాధితో బాధపడుతున్న కార్తికేయ ఆశయం
● రామారెడ్డి భవిత కేంద్రంలో ఘనంగా జన్మదిన వేడుక
రామారెడ్డి: తన చిరకాల కోరిక పోలీస్ కావడమేనని ‘మస్కులర్ డిస్ట్రోఫీ’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న కార్తికేయ అనే బాలుడు తెలిపాడు. రామారెడ్డిలోని భవిత కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఫిజియోథెరపీ క్యాంపులో కార్తికేయ జన్మదిన వేడుకను కేంద్రం సిబ్బంది ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్సై లావణ్య ముఖ్య అతిథిగా హాజరుకాగా, బాలుడికి కేక్ తినిపించి, ధైర్యం కల్పించారు. అనంతరం తన జన్మదినం వేళ కార్తికేయ చక్కటి పాటతో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇసన్నపల్లి గ్రామానికి చెందిన మాస్టర్ కార్తికేయకు మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి సోకగా తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి భవిత కేంద్రంలో విద్యనభ్యసిస్తున్నాడు. ఈ వ్యాధి అరుదుగా వస్తుందని, ఆరేళ్లు నిండిన తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడి కండరాలు పట్టివేసి అనేక రకాలుగా ఇబ్బందులు కల్గిస్తాయని, అయినా కార్తికేయ ధైర్యంగా భవిత సెంటర్‌లో చదువుతూ పాటలు పాడుతూ ఆనందంగా గడుపుతున్నాడని డాక్టర్ వెంకటస్వామి తెలిపారు. కాంప్లెక్స్ హెచ్‌ఎం ఆనంద్, సురేష్, గోపాల్, మండల సిఆర్పిలు మహముద్, యుగంధర్, సురేఖ, వెంకట స్వామి పాల్గొన్నారు.