
ఆర్మూర్ బస్టాండ్‌లో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
ఆర్మూర్‌టౌన్: నిజామాబాద్–2 డిపోకు చెందిన షేక్ హిమాం పాషా (52) అనే డ్రైవర్ ఆర్మూర్ బస్టాండ్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. వివరాలు ఇలా.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతానికి చెందిన షేక్‌హిమాం పాషాను ఖమ్మం జిల్లా నుంచి నిజామాబాద్‌కు ఆరు నెలల కోసం డిప్యుటేషన్‌పై బదిలీ చేశారు. ఆయనతో పాటు నిమాజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు మొత్తం 63 మంది ఉద్యోగులను ఆరు నెలల కోసం డిప్యుటేషన్‌పై బదిలీ చేశారు. కానీ తాను వచ్చి మూడు సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు తిరిగి స్వస్థలాలకు పంపలేదని, ఈ విషయంలో ఎలాంటి న్యాయం జరగకపోవడంతో నిరాశ చెందానన్నాడు. సెలవులు కూడా ఇవ్వడం లేదని, ఉన్నతాధికారులను పలుమార్లు కలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. దీంతో మనస్తాపం చెందిన అతడు కరీంనగర్ నుంచి నిజామాబాద్ వస్తున్న సమయంలో ఆర్మూర్ బస్టాండ్‌లో తన బస్సును నిలిపి, ఎలుకల మందు తాగాడు. వెంటనే స్థానికులు అతడిని చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆర్మూర్ డిపో అధికారులకు మరింత సమాచారం కోసం ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేరు.
డిప్యుటేషన్ బాధలే కారణం!