
ఆనంద సందర్భాలను బాలసదనంలో గడపాలి
కామారెడ్డి క్రైం : పుట్టినరోజు, పండగలు ఏవైనా ఆనంద సందర్భాలను బాలసదనం చిన్నారులతో కలిసి నిర్వహించుకోవాలని, వారిలో సంతోషాన్ని నింపాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలసదన్‌ను కలెక్టర్ గురువారం సందర్శించి వసతులను పరిశీలించారు. పిల్లలతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. బాగా చదువుకుని భవిష్యత్‌లో ఉన్నత స్థానంలో నిలవాలని చిన్నారులకు సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాల సదనం చిన్నారులకు దుప్పట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం పిల్లలకు దుప్పట్లను అందజేశారు. నూతన భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, డీసీపీవో స్రవంతి, సూపరింటెండెంట్ సంగమేశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు.