
గ్రామ పంచాయతీకి బాడీ ఫ్రీజర్ వితరణ
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు గ్రామ పంచాయతీకి బాడీ ఫ్రీజర్‌ను ఆదివారం వితరణ చేశారు. బాలుర పాఠశాలలో 1998–99 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు గత మే నెలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి తమ వంతుగా సహాయం చేయాలని రూ. 50 వేలు విలువ గల బాడీ ఫ్రీజర్‌ను వితరణ చేశారు. అలాగే పాఠశాలకు రూ.10 వేల విలువ గల సౌండ్ సిస్టంను అందజేశారు. పూర్వ విద్యార్థులు శ్రీకాంత్, సాయిలు, కృష్ణమూర్తి, మహేష్, శ్రీధర్, స్వామి, నరేందర్, సత్యనారాయణగౌడ్, జీపీ కార్యదర్శి శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు.
మైనారిటీ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించండి
బాన్సువాడ రూరల్: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు, నాణ్యమైన విద్యకోసం మైనారిటీ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని ఎల్లారెడ్డిలోని మైనార్టీ పాఠశాల ఉపాధ్యాయులు బాలమణి, నవీన్ కుమార్, శేఖర్, శివప్రసాద్‌లు కోరారు. ఆదివారం బాన్సువాడ పట్టణంలోని ఇస్లాంపుర, డబుల్‌బెడ్‌రూం కాలనీ, సంగమేశ్వరకాలనీల్లో పాఠశాలలో అడ్మిషన్ల కోసం ప్రచారం చేపట్టారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు, యూనిఫాం, కాస్మోటిక్‌చార్జీలు, పౌష్టికాహారంతో కూడిన భోజన వసతి సౌకర్యాలు ఉన్నాయన్నారు. ముస్లిం విద్యార్థులకు ఉర్దూ, అరబ్బీ, నమాజ్ సౌకర్యం ఉంటుందన్నారు. పరిమిత సంఖ్యలో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి గల వారు ఎల్లారెడ్డిలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో సంప్రదించాలన్నారు.
కాయిన్ మింగిన బాలుడు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన బందెల తన్వీర్ అనే రెండేళ్ల బాలుడు శనివారం సాయంత్రం ఆడుకుంటూ రెండు రూపాయల కాయిన్ మింగాడు. బాలుడికి ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో వెంటనే తల్లిదండ్రులు గమనించి లింగంపేటలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఎక్స్‌రేలో రెండు రూపాయల కాయిన్ గొంతులో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు కామారెడ్డిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆక్కడ వైద్యులు ఆధునిక పరికరాల సహయంతో గొంతులో ఇరుక్కున్న కాయిన్ బయటకు తీశారు. దాంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

గ్రామ పంచాయతీకి బాడీ ఫ్రీజర్ వితరణ