
మలేషియాలో వలస కార్మికుల సదస్సు
మోర్తాడ్(బాల్కొండ): అంతర్జాతీయ వలసలపై మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఈనెల 4వ తేదీన ప్రారంభమైన మూడు రోజుల సదస్సు ఆదివారం ముగిసింది. బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సదస్సును నిర్వహించింది. భారత్‌తో పాటు ఇండోనేషియా, ఫిలిప్పీన్, బంగ్లాదేశ్, నేపాల్, ఖతార్, బహ్రెయిన్, క్రోయేసియా, మలేషియా తదితర దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో తెలంగాణ నుంచి ఖతర్‌కు వలస వెళ్లి అక్కడ తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సుందరగిరి శంకర్‌గౌడ్, గల్ఫ్ రిటర్నీ, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సైండ్ల రాజారెడ్డి పాల్గొన్నారు. ఈ సదస్సులో ‘గల్ఫ్ సంక్షేమ బోర్డు’పై చర్చించినట్లు వారు ‘సాక్షి’తో తెలిపారు. వలస కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలతో పాటు గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు జరిగితేనే సౌకర్యాలు మెరుగవుతాయనే అభిప్రాయాన్ని సదస్సులో పాల్గొన్నవారు వ్యక్తం చేశారన్నారు. వలస కార్మికులకు వివిధ దేశాల చట్టాలపై అవగాహన కల్పించడం, ఆయా దేశాలలో పాటించాల్సిన నియమ నిబంధనల గురించి వివరించడం, తద్వారా వాణిజ్యాభివృద్ధికి పాటుపడాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశామని తెలిపారు. గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, వలస కార్మికుల పిల్లలకు గురుకుల విద్యా సంస్థలలో ప్రత్యేక ప్రవేశాలకు అనుమతి, ప్రవాసీ ప్రజావాణి నిర్వహణ అంశాలను సదస్సులో వివరించామన్నారు. దీనిపై సదస్సులో పాల్గొన్నవారు హర్షం వ్యక్తం చేశారన్నారు.
‘గల్ఫ్ సంక్షేమ బోర్డు’పై చర్చ