ఇంటి నుంచి తల్లిదండ్రుల గెంటివేత
భిక్కనూరు : సమాజంలో రోజురోజుకు మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయి. వృద్ధులైన తల్లిదండ్రులను వారి పేరిట ఉన్న భూమిని తనకు ఇవ్వాలని మూడో కుమారుడు ఇంటినుంచి గెంటివేశాడు. ఈ ఘటన భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కాచాపూర్ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులైన మర్రి బాగవ్వ–రామయ్యలకు నలుగురు కొడుకులు. మూడో కుమారుడు చంద్రం ప్రేమ పెళ్లి చేసుకుని నిజామాబాద్‌లో నివసిస్తున్నాడు. మిగతా ముగ్గురు కుమారులు కాచాపూర్ గ్రామంలోనే నివసిస్తూ తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటున్నారు. రామ య్య పేరిట గ్రామంలో 1530 సర్వే నంబర్‌లో ఐదు ఎకరాల నాలుగు గుంటల భూమి ఉంది. రామయ్య బాగవ్వ దంపతులు తమ నలుగురు కుమారులకు ఒక్కొక్కరికి ఎకరం చొప్పున భూమిని పంచి వారి పేరిట పట్టా చేయించారు. మిగతా ఎకరం నాలుగు గుంటలను తమ పేరిట ఉంచుకున్నారు. తమ బాగోగులు చూసిన వారికి తదనంతరం ఈ భూమి వర్తిస్తుందని కుల పెద్ద మనుషుల ముందు ఒప్పందం చేసుకున్నారు. మూడో కొడుకు చంద్రం తల్లిదండ్రు ల పేరిట ఉన్న భూమిలో తన వాటాకు రావాల్సిన భూమిని ఇవ్వాలని వారిని వేధిస్తున్నాడు. పట్టాదా రు పాసు పుస్తకాలను లాక్కెళ్లాడు. ఈ విషయమై కులపంచాయతీ జరిగింది. తల్లిదండ్రులు బాగోగు లు చూసిన వాళ్లకు ఈ భూమిపై హక్కులు ఉంటా యని తల్లిదండ్రులు బతికి ఉన్నంత కాలం ఈ భూమిని ఎవరి పేరుమీద మార్చవద్దని పంచాయతీ లో పెద్దలు నిర్ణయించారు. దీంతో చంద్రం శనివారం తల్లిదండ్రులు నివసిస్తున్న ఇంటికి వచ్చి వారిని బయటకు గెంటి వేశాడు. సామగ్రిని బయట పారేసి ఇంటికి తాళం వేశాడు. దీంతో వృద్ధులైన తల్లిదండ్రు లు బాగవ్వ, రామయ్యలు భిక్కనూరు పోలీసులను ఆశ్రయించారు. వీరి ఫిర్యాదు మేరకు ఎస్సై ఆంజనేయులు చంద్రంపై కేసు నమోదు చేశారు.
భూమిని తన పేరిట మార్చాలని
పట్టాదారు పాసుపుస్తకాలను
లాక్కెళ్లిన మూడో కొడుకు
భిక్కనూరు మండలం
కాచాపూర్‌లో ఘటన
పోలీసులను ఆశ్రయించిన
వృద్ధ దంపతులు


