
నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ
ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం
ఎడపల్లి(బోధన్): ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. జానకంపేట గ్రామానికి చెందిన మంగళ రవి కుటుంబం వేసవి ఉక్కపోత భరించలేక ఇంటి తలుపులు తెరిచి నిద్రించారు. దుండగుడు ఇంట్లోకి చొరబడి రవి భార్య లావణ్య మెడలో ఉన్న సుమారు రెండు తులాల పుస్తెలతాడును కత్తిరించి, పుస్తెలను అక్కడే వదిలేసి గొలుసు ఎత్తుకెళ్లాడు. అలికిడి శబ్దం విన్న లావణ్య మేల్కొని అరవడంతో దొంగ పరారయ్యాడు. ఎడపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
జగదాంబ ఆలయంలో..
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని యాచారం తండా పరిధిలో ఉన్న జగదాంబ దేవి, సేవాలాల్ మహరాజ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. పూజారి రమేశ్ సోమవారం ఉదయం పూజ చేసేందుకు ఆలయానికి వెళ్లగా తాళం పగిలి ఉంది. విషయాన్ని తండా పెద్ద మనుషులకు తెలపడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. 16 తులాల వెండి, 5 గ్రాముల మంగళసూత్రం, 6 మాసాల పట్టెగొలుసులు అపహరణకు గురైనట్లు పూజారి పేర్కొన్నారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇందల్వాయి: ఇందల్వాయి గ్రామానికి చెందిన మిట్టపల్లి శ్రీనివాస్, చుక్కపురం శంకర్, చింతలపల్లి గోవర్ధన్ రెడ్డిలకు చెందిన 15 కేవీ, 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లను ఆదివారం రాత్రి దుండగులు ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్ చోరీ చేసినట్లు బాధితులు తెలిపారు. ఘటనపై ఏఈ పండరీనాథ్ సమక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు ట్రాన్స్‌ఫార్మర్లను అందించాలని బాధితులు కోరగా పైఅధికారులకు నివేదిక అందించి, వారం రోజుల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు అందేలా చూస్తామని ఏఈ తెలిపారు.

నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ