
విద్యుదాఘాతానికి రైతు బలి
రామారెడ్డి: విద్యుదాఘాతానికి ఓ రైతు బలైన ఘటన రామారెడ్డి మండలంలోని ఘన్‌పూర్ తండాలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన భుక్య రాజు నాయక్(35) బుధవారం మధ్యాహ్నం పొలంలో విరిగిపోయిన చెట్లను తొలగిస్తుండగా, మంగళవారం కురిసిన వర్షానికి తెగిపడిన విద్యుత్ వైర్లకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. రాజు నాయక్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలానికి వెళ్లి చూడగా విగత జీవిగా పడి ఉన్నాడు. మృతుడికి భార్య వనీత, ఇద్దరు పిల్లలున్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.