
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కంటెయినర్
● డ్రైవర్ మృతి, క్లీనర్‌కు తీవ్ర గాయాలు
కామారెడ్డి క్రైం: సాంకేతిక సమస్య తలెత్తడంతో రోడ్డుపై ఆగి ఉన్న లారీని అతి వేగంగా వచ్చిన ఓ కంటెయినర్ వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో కంటెయినర్ డ్రైవర్ మృతి చెందగా క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి సమీపంలోని టేక్రియాల్ బైపాస్‌కు కొద్ది దూరంలో బుధవారం వేకువజామున 5 గంటల ప్రాంతంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్తాన్‌కు చెందిన ఓ లోడ్ లారీ హైదరాబాద్ వైపు వెళ్తోంది. అదే దారిలో అతివేగంగా వచ్చిన ఓ మహారాష్ట్రకు చెందిన కంటెయినర్.. లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో కంటెయినర్ ముందు భాగం నుజ్జునుజ్జయింది. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. తీవ్రంగా గాయపడిన కంటెయినర్ డ్రైవర్ సచిన్ జవార్‌సింగ్(30), క్లీనర్‌ను కామారెడ్డి జనరల్ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే డ్రైవర్ సచిన్ జవార్‌సింగ్ మరణించాడు. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతోనే లారీ రోడ్డుపై ఆగిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.