
నాలుగేళ్లుగా కొనసా..గుతూనే
బాన్సువాడ : బీర్కూర్ వద్ద మంజీర నదిలో చెక్ డ్యాం పనులు నాలుగేళ్లుగా కొనసాగుతున్నాయి. అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక చొరవతో నాబార్డు నిధులు రూ. 28.29 కోట్ల వ్యయంతో మంజీర నదిపై చెక్ డ్యాం నిర్మాణ పనులకు అప్పటి రోడ్డు, భవనాలు, గృహనిర్మాణం, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 2021లో శంకుస్థాపన చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టే ప్రాంతంలో పూర్తిగా ఇసుక నిండి ఉంది. దీంతో బీర్కూర్‌కు చెందిన కొందరు అక్రమార్కులు అభివృద్ధి పనుల పేరిట ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు. నిత్యం టిప్పర్లలో పదుల సంఖ్యలో బీర్కూర్ నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న పట్టించుకునే వారే కరువయ్యారు. బీర్కూర్ పోలీస్‌స్టేషన్ ముందు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారే విమర్శలు వినిపిస్తున్నాయి. మరో నెల రోజుల్లో వర్షకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో చెక్ డ్యాం నిర్మాణ పనులకు బ్రేక్ పడే అవకాశం ఉంది. నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన పనులు కనీసం 30 శాతం కూడా పూర్తి కాకపోవడం గమనార్హం. బీర్కూర్ బ్రిడ్జి వద్ద చెక్ డ్యాం పనులు పూర్తయితే బీర్కూర్‌తో పాటు కిష్టాపూర్, బరంగెడ్గి, డోంగ్లీ మండలం కుర్లా, శేట్లూర్, ఖత్‌గాం గ్రామాలకు భూగర్భ జలాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.
బీర్కూర్ వద్ద మంజీర నదిలో
నెమ్మదిగా చెక్ డ్యాం పనులు
ఇసుక దందాకు తెరలేపిన అక్రమార్కులు
పట్టించుకోని సంబంధిత అధికారులు

నాలుగేళ్లుగా కొనసా..గుతూనే