
అకాల వర్షంతో రైతన్న ఆగమాగం
● కొనుగోలు కేంద్రాల వద్ద
తడిసిన ధాన్యం
● వడగళ్లతో ఇతర పంటలకూ నష్టం
● పిడుగుపాటుతో ఇద్దరి పరిస్థితి విషమం
కామారెడ్డిటౌన్/కామారెడ్డిరూరల్/భిక్కనూరు/ దోమకొండ/తాడ్వాయి/గాంధారి/లింగంపేట/రాజంపేట/బీబీపేట: జిల్లాలోని పలు ప్రాంతాలలో ఆదివారం అకాల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాలలో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కొన్నిచోట్ల వడ్లు కొట్టుకుపోయాయి. జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్‌లో వడ్లు ఆరబెట్టిన రైతులు.. వర్షం రాకతో ఆగమయ్యారు. గంట పాటు కురిసిన వర్షంతో ఇబ్బందిపడ్డారు. కామారెడ్డి పట్టణంలో గంట పాటు కురిసిన వర్షంతో రోడ్లపై నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
మాచారెడ్డి, రాజంపేట తదితర మండలాల్లో వడగళ్లు కురిశాయి. భిక్కనూరు, దోమకొండ మండలాల్లోని పలు గ్రామాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కోతకు వచ్చిన వరి పంట నేలవాలింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది.
లింగంపేట మండలంలోని భవానీపేట, జల్దిపల్లి, రాంపూర్, ముంబోజీపేట, గాంధారి మండలంలోని పలు గ్రామాలలో, తాడ్వాయి మండలకేంద్రంతోపాటు కరడ్‌పల్లి, కన్‌కల్, దేమికలాన్, కృష్ణాజీవాడి, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో బలమైన గాలులతో కూడిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డి, పాతరాజంపేట్, సరంపల్లి, క్యాసంపల్లి, దేవునిపల్లి, లింగాపూర్, నర్సన్నపల్లి, చిన్నమల్లారెడ్డి పరిధిలోని గురు రాఘవేంద్ర కాలనీలలో వడగండ్లు కురిశాయి. ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. మామిడి కాయలు రాలిపోయాయి. మొక్కజొన్న నేలవాలింది. పలుచోట్ల ఇళ్ల రేకులు లేచిపోయాయి. బీబీపేట మండలం మాందాపూర్‌లో విద్యుత్ స్తంభం విరిగి ట్రాన్స్‌ఫార్మర్‌పై పడింది. వడ్లను వెంటవెంటనే తూకం వేసి, రైస్‌మిల్లులకు తరలించకపోవడంతో నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షంతో నష్టపోయినవారిని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
తుజాల్‌పూర్‌లో పిడుగుపాటు కలకలం
అకాల వర్షం ఐదుగురి ప్రాణాల మీదికి తెచ్చింది. బీబీపేట మండలంలోని తుజాల్‌పూర్‌కు చెందిన గోప వివేక్, కలకుంట్ల రాజు, గోప కవిత, గోప హేమలత, గోప రంజిత్ వర్షం వస్తుండడంతో వడ్లను కుప్పచేసి చెట్టుకిందికి చేరారు. ఆ చెట్టుపై పిడుగుపడింది. దీనిని గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

అకాల వర్షంతో రైతన్న ఆగమాగం

అకాల వర్షంతో రైతన్న ఆగమాగం

అకాల వర్షంతో రైతన్న ఆగమాగం

అకాల వర్షంతో రైతన్న ఆగమాగం

అకాల వర్షంతో రైతన్న ఆగమాగం