
ఇక ప్రతి రైతుకు గుర్తింపు!
● 11 నంబర్ల యునిక్ కోడ్‌తో
ఐడీ కార్డులు
● ఆధార్, పాస్‌బుక్, మొబైల్
నంబర్‌లతో లింక్
● నేటి నుంచి నెలాఖరు వరకు ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ కార్యక్రమం
కామారెడ్డి క్రైం: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఫార్మర్ ఐడీ ప్రాజెక్టు అమలులో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నుంచి జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ నెలాఖరు వరకు కొనసాగనుంది. ప్రతి రైతు నుంచి వివరాలు సేకరించి రైతులందరికీ ప్రత్యేక డిజిటల్ కార్డులను జారీ చేయనున్నారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా అన్ని క్లస్టర్ల పరిధిలో ఫార్మర్ రిజిస్ట్రీని ప్రారంభించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ తెలిపారు. భవిష్యత్ అవసరాలకు, కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలకు ఈ కార్డు ప్రామాణికం కానుందని పేర్కొన్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన రుణమాఫీ, రైతు భరోసా తదితర పథకాలకు ఈ కార్డుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
భవిష్యత్తులో సంక్షేమ పథకాలను పొందడానికి అర్హులుగా ఉండాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. పీఎం కిసాన్ లబ్ధిదారులు తదుపరి లబ్ధి పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ కార్డు నంబరు ద్వారా ఆన్‌లైన్‌లో రైతు పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
ఆధార్ తరహాలో..
రైతులకు సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలకు ఫార్మర్ ఐడీ కీలకం కానుంది. ఈ గుర్తింపు సంఖ్య పొందడం సులువే.. ఆధార్, పట్టాదారు పాస్‌బుక్, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ వివరాలను వ్యయసాయ విస్తీర్ణాధికారులకు అందిస్తే.. వారు వివరాలు నమోదు చేసి, 11 నంబర్లు గల ఫార్మర్ ఐడీ సంఖ్య ఇస్తారు. రెవెన్యూ శాఖ వద్దనున్న భూయాజమాన్య వివరాలను ప్రామాణికంగా తీసుకుని రైతులకు ఐడీ కార్డులు జారీ చేస్తారు. కార్డు జారీ చేయడానికి ముందే భూమి వివరాలు సర్వే నంబర్ భూమి రకం, సాగు చేస్తున్న పంటల వివరాలు అన్నింటినీ తెలుసుకుని రెతుకు సబంధించిన పూర్తి సమాచారం ఇందులో నమోదు చేస్తారు.