
భారంగా మారిన పశు పోషణ
బిచ్కుంద(జుక్కల్): యాసంగిలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. కొందరు గడ్డి వ్యాపారులు ట్రాక్టర్లకు గడ్డి మోపుచుట్టే పరికరాలు బిగించి గడ్డి కట్టలు కడుతున్నారు. పశువులు లేని రైతులకు వ్యాపారులు కొంత నగదు ఇచ్చి పొలంలో వదిలేసిన గడ్డిని కొనుగోలు చేస్తున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో గడ్డి ధరలు విపరీతంగా పెరగడంతో రైతులపై భారం పడనుంది.
గడ్డి వ్యాపారులు ట్రాక్టర్ యంత్రాలతో గడ్డి మోపులు కట్టి వాహనాల్లో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు తరలించి అమ్ముకుంటున్నారు. గడ్డి ధరలు పెరగడంతో స్దానిక పాడి రైతులకు భారంగా మారింది. ఒక్కో మోపు ధర రూ. 25 నుంచి 35 లకు విక్రయిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఒక్కో గడ్డి మోపును రూ. 70 విక్రయిస్తున్నారు. ఖరీఫ్, రబీలో బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, పిట్లం మండలాల్లో ఎక్కవగా సోయా, కంది పంటలు సాగు చేస్తారు. సోయా, కంది పంటల నూర్పిళ్లు జరిగిన వెంటనే వ్యాపారులు రైతులకు కొంత నగదు చెల్లించి పొట్టును తీసుకెళ్తున్నారు. వ్యాపారుల రాకతో స్థానిక పాడి రైతులకు గడ్డి, కంది, సోయా పొట్టు దొరకడం భారంగా మారింది. పాల ఫ్యాట్ రావడానికి కొనుగోలు చేసిన గడ్డితో పాటు పశువులకు దాణా ఇవ్వాల్సి వస్తుంది. రోజుకు రూ. 100 నుంచి 150 ఖర్చు చేయాల్సి వస్తుంది. పాలు అమ్మిన గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు.
గడ్డి విత్తనాలు అందించని ప్రభుత్వం
పాడి రైతులు, మేకలు, గొర్రెలు ఉన్న రైతులకు గతంలో ప్రభుత్వం ఉచితంగా గడ్డి విత్తనాలు, దాణా అందించేది.
ఐదారు ఏళ్ల నుంచి ప్రభుత్వం వీటి సరఫరా నిలిపి వేయడంతో పశు పోషణ రైతులకు భారంగా మారింది. సంవత్సరం పాటు నిలువ ఉంచడానికి గడ్డి మోపులను కొనుగోలు చేయాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. వ్యవసాయ భూమి, బోరు మోటారు ఉన్న రైతులకు ప్రభుత్వం గడ్డి విత్తనాలను, అలాగే దాణా సరఫరా చేస్తే పోషణ భారం తగ్గుతుందని రైతులు అభిప్రాయపడు తున్నారు.
పశుగ్రాసం కొరతతో ఇబ్బందులు
పక్క రాష్ట్రాలకు తరలుతున్న గ్రాసం
స్థానికంగా ధరలు పెంచిన వ్యాపారులు