కామారెడ్డి క్రైం: విధి నిర్వహణలో అలసత్వం వహించే వారిపై చర్యలు తప్పవని ఎస్పీ రాజేశ్ చంద్ర హెచ్చరించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అన్ని పీఎస్‌ల ఎస్‌హెచ్‌వోలతో సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా పరిస్థితులు, కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి, గ్రామానికి సంబంధించిన సమాచారం వెంటనే తెలుసుకోవడానికిగాను ప్రతి గ్రామానికి ఒక పోలీస్ అధికారి ఇన్‌చార్జీగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రౌడీ, అనుమానిత హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. బ్యాంక్, ఏటీఎం, పెట్రోల్ బంక్, ప్రార్థన స్థలాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై అన్ని స్థాయిల అధికారులు దృష్టి సారించాలన్నారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ దాఖలు వరకు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. కేసుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వేగంగా విచారణ పూర్తి చేయడంతో పాటు నిర్ణీత సమయంలో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. కేసులలో నేరస్తులకు శిక్ష పడేలా కృషిచేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి అసిస్టెంట్ ఎస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్‌రావు, సత్యనారాయణ, ఎస్బీ సీఐ తిరుపయ్య, డీసీఆర్‌బీ సీఐ మురళి తదితరులు పాల్గొన్నారు.