
నిజామాబాద్ మార్కెట్‌లోని పసుపు నిల్వలు
మోర్తాడ్(బాల్కొండ): పసుపు పంటకు ధర అంతంత మాత్రంగానే పలుకుతోంది. సీజన్ ముగింపు దశలోనూ ఈ పరిస్థితిపై రైతులు నిరాశ చెందుతున్నారు. పసుపు క్రయవిక్రయాలు మొదలైన నుంచి క్వింటాలుకు రూ. 4వేల నుంచి రూ. 6,500 వరకే ధర వస్తోంది. ఒకరిద్దరు రైతుల పసుపు పంటకు రూ. 7వేల వరకు ధర పలికినా మెజారిటీ రైతులకు మాత్రం ధర తక్కువగా లభించింది. అకాల వర్షాలతో పసుపు దిగుబడులు తగ్గిపోవడంతో ఉన్న పసుపు పంటకు ధర పెరగాల్సి ఉంది. కానీ మార్కెట్‌లో భిన్నమైన పరిస్థితి నెలకొంది. దిగుబడులు ఆశించిన విధంగా లేకపోవడంతో రైతులు సాంగ్లీ మార్కెట్‌కు పసుపును తరలించలేదు. నిజామాబాద్ మార్కెట్‌లోనే ఎక్కువ మంది పసుపును విక్రయించారు. రోజుకు గతంలో 20 వేల నుంచి 30 వేల సంచుల వరకు పసుపు మార్కెట్‌కు వచ్చి పడేది. ఈసారి ఐదు వేల నుంచి 15 వేల సంచుల పసుపు మాత్రమే మార్కెట్‌కు తరలుతోంది. దిగుబడులు లేకపోవడం, ధర అంతంత మాత్రంగానే ఉండడంతో పసుపు పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. సీజన్ ముగింపు దశలో క్వింటాలు పసుపునకు రూ. 9వేల నుంచి రూ. 10వేల ధర లభిస్తుందని రైతులు ఆశించారు. పొరుగు రాష్ట్రంలోని పసుపును అక్కడి రైతులు తక్కువ ధరకు విక్రయిస్తున్నారని అందువల్ల ఇక్కడి పసుపునకు ధర లేదని వ్యాపారులు చెబుతున్నారు. పసుపు నాణ్యత లేకపోవడం కూడా ధర తగ్గిపోవడానికి ఒక కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
క్వింటాలుకు రూ. 6,500
దాటని వైనం
సీజన్ చివరి దశలోనూ
ధర పెరగకపోవడంతో రైతుల్లో నిరాశ
గత సీజన్ కంటే మార్కెట్‌కు
తరలించే పసుపు నిల్వలు తక్కువే