నీరు ఎలా పంపాలి?
అన్నవరంలోని పంపా రిజర్వాయర్
అన్నవరం: పంపా రిజర్వాయర్ కింద ఈ ఏడాది రబీ సాగుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినా.. ఎన్ని ఎకరాలకు నీరు సరఫరా చేస్తారనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. ప్రస్తుతం పంపా నదీ గర్భంలో నిర్మిస్తున్న పోలవరం అక్విడెక్ట్ పనులు జరుగుతున్నాయి. ఇవి వేగంగా జరగాలంటే పంపా రిజర్వాయర్ నీటిమట్టం 91 అడుగులకు తగ్గించాలని పోలవరం అధికారులు కోరుతున్నారు. మరోవైపు నీటిని వృథాగా వదిలేయడంకన్నా రబీకి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంపా రిజర్వాయర్ అధికారులు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఇది జరగాలంటే పంపాకు ఏలేరు నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. ఏలేరు నుంచి ఎన్ని క్యూసెక్కుల నీరు విడుదల చేస్తారనే దానిపై పంపా ఆయకట్టులో ఎన్ని వేల ఎకరాల్లో రబీ సాగు జరుగుతుందనేది ఆధారపడి ఉంటుంది.
రబీకి నీటి కొరత
పంపా రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 103 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 0.43 టీఎంసీలు. పంపా పూర్తి ఆయకట్టు 12,500 ఎకరాల్లో ఖరీఫ్ పంటల సాగుకు సుమారు 1.5 టీఎంసీల నీరు అవసరమవుతోంది. అయితే, ఆ సమయంలో వర్షాలు కురుస్తాయి కాబట్టి రిజర్వాయర్ నుంచి నీటి అవసరం తక్కువగా ఉంటుంది. ఈ ఏడాది ఖరీఫ్‌లోనూ అదే జరిగింది. వర్షాలు దండిగా కురవడంతో రైతులు పూర్తి స్ధాయి ఆయకట్టులో వరి సాగు చేశారు. అదే పూర్తి స్థాయి ఆయకట్టులో రబీ సాగు జరగాలంటే పంపా రిజర్వాయర్ నుంచి నీరు పుష్కలంగా అందాలి. పది వేల ఎకరాల్లో సాగు చేయాలంటే ఒక టీఎంసీ నీరు అవసరం. కానీ, పంపాలో గరిష్ట స్థాయిలో 0.43 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉంటోంది. ప్రస్తుతం పంపాలో నీటిమట్టం 97.5 అడుగులు ఉంది. నీటి నిల్వలు 0.25 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. మొత్తం 10 వేల ఎకరాల్లో రబీ సాగు జరగాలంటే మరో 0.75 టీఎంసీల నీరు అవసరం.
ఏలేరే గతి
పంపా ఆయకట్టులో నీటి కొరతను అధిగమించాలంటే ఏలేరు రిజర్వాయర్‌పై ఆధారపడటం మినహా మరో మార్గం కనిపించడం లేదు. రౌతులపూడి మండలం శృంగవరం వద్ద ఏలేరు కాలువ నుంచి రోజుకు గరిష్టంగా 50 క్యూసెక్కుల వరకూ నీటిని పంపాకు విడుదల చేయవచ్చు. అంతకంటే ఎక్కువ నీటిని విడుదల చేస్తే పక్కనే ఉన్న పొలాలు ముంపునకు గురవుతాయి. అందువలన అక్కడి రైతులు అంగీకరించరు. జనవరి 1 నుంచి మార్చి నెలాఖరు వరకూ ఏలేరు నుంచి నీటిని విడుదల చేసినా.. ప్రస్తుతం పంపాలో ఉన్న నీటితో కలిపి సుమారు 6 వేల ఎకరాల్లో మాత్రమే రబీ సాగుకు వీలవుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
గత ప్రభుత్వంలో రెండు పంటలకూ నీరు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో పంపా జలాశయం కింద రెండు పంటలకూ పుష్కలంగా నీరందించారు. పంపాతో పాటు పుష్కర కాలువ నీటితో ఖరీఫ్, ఏలేరు నుంచి విడుదల చేసిన నీటితో రబీ సాగు సుమారు 10 వేల ఎకరాల్లో జరిగేలా చర్యలు తీసుకున్నారు. గత ఏడాది అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ ఏడాది ఖరీఫ్ సాగుకు మాత్రమే నీరిచ్చింది. పంపా బ్యారేజీ గేట్ల మరమ్మతుల పేరిట గత ఏడాది రబీకి నీరివ్వలేదు. పైగా పోలవరం అక్విడెక్ట్ పనుల పేరుతో పంపా నీటిని దిగువకు వృథాగా వదిలేశారు. దీంతో, పంపా ప్రాజెక్ట్‌లో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటి, అన్నవరం గ్రామంతో పాటు, సత్యదేవుని ఆలయానికి కూడా నీటి సమస్య ఏర్పడే పరిస్థితి ఉత్పన్నమైంది. ఒక దశలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నవరం వచ్చి పరిస్థితిని సమీక్షించి, ఏలేరు నీటిని పంపాకు విడుదల చేసేలా ఆదేశించారు. అదే సమయంలో ఆ నీటి విడుదల వలన పోలవరం అక్విడెక్ట్ పనులకు ఆటంకం కలగకుండా ప్రత్యేకంగా కాలువ, పైప్‌లైన్ వేయించారు.
స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసం..
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గత ఏడాది రబీలో పంపా ఆయకట్టు నీటికి ఎగనామం పెట్టింది. వచ్చే ఏడాది స్థానిక సంస్ధల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అందువలన ఈసారైనా సాగునీరు ఇవ్వకపోతే తొండంగి, తుని మండలాల్లోని పంపా ఆయకట్టు రైతుల్లో తీవ్ర అసంతృప్తి వస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా 10 వేల ఎకరాల్లో రబీ సాగుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఏలేరు నుంచి 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించి రబీకి నీరందిస్తామని వారు చెబుతున్నట్లు సమాచారం. అయితే, పంపా కాలువకు ఇరువైపులా ఉన్న గ్రామాల్లోని 6 వేల ఎకరాల్లో మాత్రమే రబీ సాగుకు నీరు సరఫరా చేయగలమని, అంతకు మించి సాగు చేస్తే పంట చివరిలో నీటి సమస్య తలెత్తుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ నిర్ణయం మేరకే..
పంపా ఆయకట్లులో రబీ సాగు ఎంత విస్తీర్ణంలో చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం పంపాలో ఉన్న నీరు, ఏలేరు నుంచి నీటి సరఫరా సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే రబీ ఆయకట్టు నిర్ణయించాలి. ఈ విషయాలన్నీ వివరిస్తూ జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇచ్చాం. ప్రభుత్వం అనుమతిస్తే జనవరి 1 నుంచి రబీ నారుమడులకు నీటిని విడుదల చేస్తాం.
– జి.శేషగిరిరావు, ఈఈ, ఇరిగేషన్, పెద్దాపురం
పంపా ఆయకట్టులో రబీ సాగుపై సందిగ్ధం
10 వేల ఎకరాలకు నీరివ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి
6 వేల ఎకరాలకు మించి
ఇవ్వలేమంటున్న ఇరిగేషన్ అధికారులు
నీరు ఎలా పంపాలి?


