తలుపులమ్మ తల్లికి రూ.49.58 లక్షల ఆదాయం
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారికి హుండీల ద్వారా రూ.49.58 లక్షల ఆదాయం సమకూరింది. అన్నవరం వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి ఎం.మంజులాదేవి పర్యవేక్షణలో లోవ దేవస్థానంలో హుండీలను శుక్రవారం తెరచి నగదు లెక్కించారు. మొత్తం 71 రోజులకు గాను రూ.45,76,941 నగదు, రూ.3,81,514 నాణేలు కలిపి రూ.49,58,455 ఆదాయం సమకూరిందని లోవ దేవస్థానం డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. బంగారం 59.20 గ్రాములు, వెండి 1,156 గ్రాములు లభించిందన్నారు.
కళాకారుడు కింతాడ మృతి
కిర్లంపూడి: సీనియర్ కళాకారుడు కింతాడ సన్యాసిరావు శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. మండలంలోని చిల్లంగి గ్రామానికి చెందిన ఆయన వేలాదిగా జానపద గేయాలు, భక్తి గీతాలు రచించారు. అనేక సాంఘిక నాటకాల కథలు, వ్యాసాలు రాసి ప్రజలను మెప్పించారు. హైదరాబాద్ రవీంద్ర భారతితో పాటు అనేక కళాక్షేత్రాల్లో తన బృందంతో హరికథలు, బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చారు. 20 ఏళ్ల క్రితం అమెరికాలో జరిగిన తానా సభలకు నిర్వాహకులు ఆయనను ప్రత్యేకంగా పిలిపించి గేయాలు పాడించారు. నాడు కాళ్లకు గజ్జెలు కట్టి, తప్పెటగుళ్లతో జానపద గేయాలు ఆలపించి, తానా సభలకు వచ్చిన ప్రముఖలను మైమరపించారు. ఎంతో మందిని కళాకారులుగా తీర్చిదిద్దారు. సన్యాసిరావు మరణించారనే సమాచారం తెలిసి కళాకారులు ద్రిగ్భాంతికి గురయ్యారు.
‘అన్నవరం, వాడపల్లి’
నిర్వహణలో గోదావరి హారతి
అన్నవరం: రాజమహేంద్రవరంలో నిత్యం నిర్వహిస్తున్న గోదావరి హారతి కార్యక్రమాన్ని ఇకపై కాకినాడ జిల్లా అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం, కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ మేరకు దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకూ అన్నవరం దేవస్థానం మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో ప్రతి రోజూ సాయంత్రం 6.30 నుంచి 7 గంటల వరకూ జరిగే గోదావరి హారతి కార్యక్రమానికి అన్నవరం దేవస్థానం ప్రతి నెలా రూ.2.50 లక్షలు ఖర్చు చేస్తోంది. ఇకపై అన్నవరం దేవస్థానం రూ.1.5 లక్షలు (60 శాతం), వాడపల్లి దేవస్థానం రూ.లక్ష (40 శాతం) ఖర్చు చేయాలని కమిషనర్ ఆదేశించారు. దీనివలన అన్నవరం దేవస్థానానికి ఏడాదికి రూ.12 లక్షలు ఆదా కానున్నాయి.
పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పోస్టుల భర్తీకి అర్హులైన న్యాయవాదుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. దరఖాస్తులు జిల్లా న్యాయస్థాన అధికారిక వెబ్‌సైట్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నోటీస్ బోర్డులో అందుబాటులో ఉంటాయన్నారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్‌కు క్రిమినల్ లాలో కనీసం పదేళ్లు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్‌కు కనీసం ఏడేళ్ల అనుభవంతో పాటు మంచి సంభాషణ, లేఖన నైపుణ్యాలు ఉండాలని వివరించారు. అర్హులైన న్యాయవాదులు ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. వివరాలకు డిస్ట్రిక్ట్స్.ఈకోర్ట్స్.జీఓవీ.ఇన్.ఈస్ట్‌గోదావరి వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు.
‘తూర్పు’ పోలీసు విభాగానికి
ఏబీసీడీ అవార్డు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాష్ట్రవ్యాప్తంగా కీలక కేసుల దర్యాప్తులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే వారికి ప్రతి మూడు నెలలకోసారి ప్రకటించే అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ (ఏబీసీడీ) అవార్డు తూర్పు గోదావరి జిల్లా పోలీసులు సాధించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నుంచి ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఈ అవార్డు అందుకున్నారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకూ మూడు నెలలకు గాను కొవ్వూరు టౌన్ స్టేషన్‌లో నమోదైన హత్య కేసును ఛేదించినందుకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
తలుపులమ్మ తల్లికి రూ.49.58 లక్షల ఆదాయం


