సైన్‌్స సంబరానికి వేళాయె..
● నేడు జిల్లా స్థాయి సైన్స్ పోటీలు
● వేదిక కాకినాడ సాలిపేట
బాలికోన్నత పాఠశాల
● 200 ప్రాజెక్టుల ప్రదర్శన
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): తరగతి గదుల్లో.. పాఠ్య పుస్తకాల్లో నేర్చుకున్న విజ్ఞానంతో.. ఆలోచనలకు పదును పెడితేనే సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టే అవకాశం కలుగుతుంది. సరికొత్త ప్రగతికి పునాది పడుతుంది. ఆవిధంగా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, శాసీ్త్రయ విజ్ఞానాన్ని, అవగాహనను ప్రోత్సహించి.. ఆలోచనా శక్తిని పెంచి నూతన ఆవిష్కరణలు చేసేలా.. పాఠశాల విద్యా శాఖ, బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రీ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం ఆధ్వర్యాన దక్షిణ భారత విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తోంది. తద్వారా ప్రయోగాత్మక నైపుణ్యాలు, సిద్ధాంతాలను స్వయంగా నిరూపించే అవకాశం కల్పిస్తోంది. దీనిలో భాగంగా విద్యార్థులు తమ ప్రాజెక్టులు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే పాఠశాల స్థాయిలో ప్రదర్శనలు పూర్తి చేశారు. గత వారంలో మండల స్థాయి సైన్స్ సంబరాలు నిర్వహించారు. ఇందులో జిల్లావ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు వివిధ ప్రాజెక్టులు ప్రదర్శించారు. వాటిల్లో వివిధ విభాగాల నుంచి అత్యుత్తమంగా గుర్తించిన 200 ప్రాజెక్టులను జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కాకినాడ సాలిపేటలోని పైండా సత్తిరాజు మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో శనివారం జరగనుంది. ఇందులో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 8, 9, 10 తరగతుల విద్యార్థులు తమ ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు. జిల్లా స్థాయిలో ప్రతి గ్రూపు నుంచి రెండేసి ప్రాజెక్టులు ఎంపిక చేసి, రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు పంపిస్తారు.
మూడు కేటగిరిల్లో..
● ఈ పోటీలు ప్రధానంగా మూడు కేటగిరీల్లో ఏడు అంశాలపై, తొమ్మిది సబ్జెక్టుల్లో నిర్వహిస్తున్నారు.
● ఉపాధ్యాయుల ప్రదర్శన : ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే పాల్గొనాలి.
● విద్యార్థుల వ్యక్తిగత ప్రదర్శన : ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుడు పాల్గొనవచ్చు.
● విద్యార్థుల గ్రూపు : ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు పాల్గొనాలి.
● సబ్జెక్టు : భౌతిక, రసాయన శాస్త్రాలు, గణితం, ఎర్త్ అండ్ స్పేస్ సైన్స్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్, బయో సైన్స్, బయో కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్.
● అంశాలు : సస్టెయినబుల్ అగ్రికల్చర్, వేస్ట్ మేనేజ్‌మెంట్ అండ్ ఆల్టర్నేటివ్ ప్లాస్టిక్, గ్రీన్ ఎనర్జీ, ఎమర్జింగ్ టెక్నాలజీ, రీక్రియేషనల్ మ్యాథ్‌మెటికల్ మోడలింగ్, హెల్త్ అండ్ హైజీన్, వాటర్ కన్జర్వేషన్ మెథడ్ అండ్ మేనేజ్‌మెంట్.
సృజనాత్మకతకు దోహదం
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయి. మేధస్సుకు పదును పెట్టేందుకు ఉపకరించే ఈ ప్రదర్శనల్లో విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు చైతన్యపరచాలి.
– పిల్లి రమేష్, జిల్లా విద్యా శాఖాధికారి, కాకినాడ
సైన్‌్స సంబరానికి వేళాయె..


