
రత్నగిరిపై ముగిసిన సంప్రోక్షణ
● ఘనంగా శాంతి హోమం, పూర్ణాహుతి
● సాక్షి కథనంపై స్పందన
అన్నవరం: రత్నగిరి వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తులు, సిబ్బంది, ప్రకృతి ద్వారా సంభవించే అపశృతులు, అపచారాల వల్ల ఎదురయ్యే దుష్ఫలితాలను పారదోలి భక్తి, ఆధ్యాత్మిక వాతావరణ పునరుద్ధరణకు చేపట్టిన సంప్రోక్షణ పూజలు బుధవారంతో ముగిశాయి. దేవస్థానం విశ్రాంత వేద పండితుడు, వైదిక సలహాదారు, త్రివేది బ్రహ్మశ్రీ కపిలవాయి రామశాస్త్రి సూచనలతో నిర్వహిస్తున్న శాంతి హోమం పూర్ణాహుతితో ముగిసింది.
ఆలయంలోని దర్బారు మండపంలో పూజలు ముగిసిన అనంతరం పండితులు మంత్ర జలాలను స్వామి, అనంతలక్ష్మీ సత్యవతీ దేవి అమ్మవారు, శంకరులపై సంప్రోక్షించారు. అనంతరం ఆలయ ప్రాంగణం నలుమూలలా, యంత్రాలయం, రామాలయం, వ్రతమండపాలు, నిత్య కల్యాణమండపం, మెట్లదారి, ఘాట్‌రోడ్, వివిధ సత్రాలలో మంత్ర జలాన్ని చల్లి శుద్ధి చేశారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు, కపిలవాయి రామశాస్త్రి సోమయాజి, వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠీ, గంగాధరభట్ల గంగబాబు, చిట్టి శివ, యనమండ్ర శర్మ, ముష్టి పురుషోత్తం, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, అర్చకులు దత్తాత్రేయ శర్మ,సుధీర్, కంచిబట్ల సాయిరామ్, కల్యాణ బ్రహ్మ చామర్తి కన్నబాబు, పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్, ఇతర వైదిక బృందం నిర్వహించారు.
‘సాక్షి’ కథనంతో..
దేవస్థానంలో చాలా కాలంగా సంప్రోక్షణ పూజలు కాని, ప్రత్యేక యాగాలు, కోటి తులసి పూజలు జరగకపోవడంతో మూడు నెలలుగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు పండితులు, అర్చకస్వాములు అభిప్రాయపడ్డారు. దీనిపై ఏడో తేదీన సాక్షి దినపత్రికలో ‘ అపశృతులు అందుకేనా...?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు శాంతి పూజలు నిర్వహించాలని పండితులను ఆదేశించారు. దాంతో ఆలయ వైదిక సలహాదారు రామశాస్త్రి సోమయాజి సూచనలతో సంప్రోక్షణ పూజలు, శాంతి హోమం నిర్వహించారు.