
నగరపాలక సంస్థ కమిషనర్ బాధ్యతల స్వీకరణ
సీటీఆర్‌ఐ: రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్‌గా రాహుల్ మీనా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న మీనాను రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్‌కు కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్‌ఎంసీ కార్యాలయంలో కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తొలుత కార్యాలయ ఆవరణలోని శ్రీ అభయ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. పురవాసులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, సమస్యలుంటే తనను సంప్రదించాలని కోరారు. నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్యం, మౌలిక వసతులు కల్పిస్తామని వెల్లడించారు. సాంకేతికత సాయంతో గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని వివరించారు. కలెక్టర్ కీర్తి చేకూరిని, జిల్లా ఎస్పీ నరసింహకిషోర్‌ను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందచేశారు.
పంచారామాలకు
ప్రత్యేక బస్సులు
తుని: కార్తికమాసం సందర్భంగా తుని డిపో నుంచి అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు స్థానిక డిపో మేనేజర్ జీజీవీ రమణ తెలిపారు. బుధవారం ఆ మేరకు స్థానిక డిపోలో కరపత్రాలను విడుదల చేశారు. డిపో మేనేజర్ రమణ మాట్లాడుతూ ఈ నెల 26, నవంబర్ 2, 9, 16 తేదీల్లో (ఆదివారాలు) బస్సు తునిలో బయలుదేరి దర్శనానంతరం సోమవారం సాయంత్రం తిరిగి తుని చేరుతుందన్నారు. ఈ బస్సు టికెట్టు ధర రూ.1250 నిర్ణయించామన్నారు. వివరాలకు 73829 13216, 90633 66433, 73829 13016 నంబర్లను సంప్రదించవచ్చన్నారు.
ఐఫోన్ కొనుగోలులో
రూ.1.04 లక్షల మోసం
రాజమహేంద్రవరం రూరల్: ఓఎల్‌ఎక్స్‌లో పెట్టిన ఐఫోన్‌ను కొనుగోలు చేద్దామనుకుంటే గుర్తు తెలియని వ్యక్తి తనను సంప్రదించి నగదు వేస్తే ఐఫోన్ అందజేస్తానని చెబితే అతని బ్యాంకు ఖాతాకు రూ.1.04 లక్షలు వేస్తే తనను మోసం చేసాడని మోరంపూడి సాయినగర్‌కు చెందిన పసగడుగుల రాజా శ్రీవెంకటసాయి బుధవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం మోరంపూడి సాయినగర్‌కు చెందిన సాయి ఓఎల్‌ఎక్స్‌లో ఐఫోన్ ఎం ప్రో మోడల్‌ను కొనుగోలు చేయడానికి గుర్తు తెలియని వ్యక్తికి గత నెల 26వ తేదీన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాకు రూ.1.04 లక్షలు పంపాడు. కానీ సదరు వ్యక్తి ఐఫోన్‌ను అందించకుండా సాయి ఫోన్‌నెంబర్‌ను బ్లాక్ చేశాడు. సదరు వ్యక్తిపై వెంటనే సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేయడంతో ఆ మొత్తంలో రూ.1,03,970ను హోల్డ్‌లో పెట్టినట్టు సాయి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాష్ట్రంలో నాలుగు
స్పోర్ట్స్ అకాడమీలు
దేవరపల్లి: రాష్ట్రంలో నాలుగు స్పోట్స్ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. తిరుపతి, నెల్లూరు, కాకినాడ, విశాఖలలో అకాడమీల ఏర్పాటుకు శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు అధ్యక్షతన ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో తీర్మానించినట్టు ఆయన చెప్పారు. ఈ ఏడాది తొలి విడతలో దేవరపల్లి, కొండెపి, కుప్పం, పాయకరావుపేటలో క్రీడా వికాస కేంద్రాలు నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు. కొవ్వూరులో రాష్ట్రస్థాయి అండర్–17 వాలీబాల్ పోటీలు, దేవరపల్లిలో అండర్–17 సెపక్‌తక్రా రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. దేవరపల్లి మండలంలో దేవరపల్లి, దుద్దుకూరు, యర్నగూడెం, చిన్నాయగూడెం, యాదవోలు గ్రామాల్లోని జెడ్పీ పాఠశాలల్లో క్రీడా మైదానాలు ఉన్నందున వాటి అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.
అంగరంగ పవిత్రోత్సవాలు
మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి సన్నిధిలో మూడు రోజులు జరిగే పవిత్రోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారిలో విశేషమైన తేజస్సు కోసం నిర్వహించే ఈ పవిత్రోత్సవాలకు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి వారి శిష్య బృందం ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. విష్వక్సేనారాధనతో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది.