
ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు డబ్బు డిమాండ్
రాజోలు: చనిపోయిన ఉద్యోగికి ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి పొందేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి లంచం అడిగిన రాజోలు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కె.రాంబాబును గురువారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కిశోర్‌కుమార్ కథనం ప్రకారం.. రాజోలుకు చెందిన గుబ్బల కృష్ణతులసి భర్త బాలకృష్ణ స్థానిక ఫైర్ స్టేషన్‌లో ఫైర్ ఆఫీసర్‌గా పని చేస్తూ గుండెపోటుతో మృతి చెందారు. బాలకృష్ణ మృతి చెందడంతో ఫైర్ డిపార్ట్‌మెంట్ నుంచి రావాల్సిన లబ్ధిని పొందేందుకు నో ఎర్నింగ్, నో ప్రొపర్టీ తదితర ధ్రువీకరణ పత్రాలకు కృష్ణతులసి దరఖాస్తు చేసుకున్నారు. రెండు నెలలుగా ఆమెకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఆర్‌ఐ రాంబాబు కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆమెకు నో ఎర్నింగ్, నో ప్రొపర్టీ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసేందుకు రూ. 20 వేలు డిమాండ్ చేయడంతో కృష్ణతులసి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రూ. 20 వేలు ఆర్‌ఐ రాంబాబు తన కార్యాలయంలో తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కిశోర్‌కుమార్, సీఐలు భాస్కరరావు, సతీష్, వాసుకృష్ణ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడు రాంబాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వివరించారు. తన భర్త బాలకృష్ణ చనిపోయిన నాటి నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నానని, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం ఆర్‌ఐ రాంబాబు రూ. 15 వేలు డిమాండ్ చేస్తే ఆ డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్ తీసుకున్నానని బాధితురాలు కృష్ణతులసి చెప్పారు. మళ్లీ నో ఎర్నింగ్, నో ప్రొపర్టీ సర్టిఫికెట్స్ కోసం రూ. 20 వేలు డిమాండ్ చేస్తే విసిగిపోయి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఆర్‌ఐ రాంబాబు నాలుగు నెలల కిందట రామచంద్రపురం నుంచి రాజోలు బదిలీపై వచ్చారు. వచ్చిన నాటి నుంచి ఆయనపై తమకు పలు ఫిర్యాదులు వచ్చాయని ఏసీబీ అధికారులు తెలిపారు.
ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్