
రక్షణ కల్పించాలని ప్రజల ఆందోళన
మామిడికుదురు: ఓఎన్జీసీ డ్రిల్లింగ్ బావి వద్ద బుధవారం జరిగిన గ్యాస్ కిక్ సంఘటన నేపథ్యంలో స్థానికులు గురువారం ధర్నా చేశారు. తమకు రక్షణ కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. పాశర్లపూడి – పాశర్లపూడిలంక గ్రామాల సరిహద్దులోని డ్రిల్లింగ్ నిర్వహిస్తున్న రిగ్ వద్ద ఈ ధర్నా జరిగింది. ఓఎన్జీసీ కార్యకలాపాలతో అనుక్షణం తాము భయం, భయంగా గడుపుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఎక్కడో కూర్చుని పరిస్థితి అదుపులో ఉందని చెప్పడం ఏంటంటూ నిరసన తెలిపారు. డ్రిల్లింగ్ జరుగుతున్న ప్రాంతానికి వచ్చి ప్రజలకు తగిన వివరణ, భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడ చేపట్టిన రిఫైర్స్ పనులను అడ్డుకున్నారు. ఈ నిరసనలో మాజీ సర్పంచ్ కొనుకు నాగరాజు, పొన్నమండ రామస్వామి, బిరుదుగంటి నరసింహమూర్తి, మోకా దుర్గారావు, అడబాల దొరబాబు, గోనిపాటి మధుబాబు, తాడి శ్రీనివాసు, రొక్కాల రాజశేఖర్, పొలమూరి గోపాల్, ఉండ్రు చిన్న, నాగిడి వీరవెంకటరమణ, కోలా సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.