అసంతృప్తిపై దిద్దుబాట
● దేవస్థానాలకు ప్రత్యేక
అధికారుల నియామకం
● భక్తుల అసంతృప్తి తొలగించే
బాధ్యత అప్పగింత
● కమిషనర్ ఆదేశాలు
● అన్నవరం దేవస్థానానికి
ఆర్‌జేసీ త్రినాథరావు
అన్నవరం: రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాల్లో అందిస్తున్న సేవలపై భక్తుల అసంతృప్తి శాతం రోజురోజుకూ పెరుగుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ సర్వేల్లో వెల్లడవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్‌జేసీ), డిప్యూటీ కమిషనర్ (డీసీ) స్థాయి అధికారులు ఈఓలుగా ఉన్న దేవస్థానాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ మేరకు దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. భక్తులకు సంతృప్తకర స్థాయిలో సేవలందించడంలో ఆయా దేవస్థానాల అధికారులు విఫలమవుతున్నందున ఈ చర్య తీసుకున్నారు.
నియమించింది వీరినే..
● అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి వేంకటేశ్వరస్వామి, విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానాలకు రాజమహేంద్రవరం ఆర్‌జేసీ వి.త్రినాథరావును నియమించారు. ఈయన గతంలో అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా కూడా పని చేశారు.
● తుని మండలం లోవ కొత్తూరులోని తలుపులమ్మ తల్లి దేవస్థానం ప్రత్యేక అధికారిగా కాకినాడ డీసీ రమేష్‌బాబు నియమితులయ్యారు.
● ద్వారకా తిరుమల చినవెంకన్న దేవస్థానానికి జాయింట్ కమిషనర్ (ఎస్టేట్స్) డి.భ్రమరాంబను ప్రత్యేకాధికారిగా నియమించారు.
● శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, చిత్తూరు, కర్నూలు జిల్లాలోని మరో రెండు డీసీ క్యాడర్ ఆలయాలకు అన్నవరం దేవస్థానం పూర్వ ఈఓ, తిరుపతి ఆర్‌జేసీ ఎస్‌ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ నియమితులయ్యారు.
ఇవీ బాధ్యతలు
ప్రత్యేకాధికారులుగా నియమితులైన వారు ఆయా దేవస్థానాల్లో మౌలిక వసతుల కల్పన, సులభ దర్శనాలు, ప్రసాదం నాణ్యత, క్యూల నిర్వహణ, పారిశుధ్యం మెరుగుదల వంటి అంశాలను పర్యవేక్షించాలని కమిషనర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆయా ఆలయాల ఈఓలతో సమావేశమై భక్తుల అసంతృప్తి తొలగించేందుకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటారు. ప్రతి రోజూ ఆ దేవస్థానాల సిబ్బందితో సమావేశాలు, సమీక్షలు నిర్వహించి, భక్తుల అభిప్రాయాలు సేకరించి, పరిస్థితి మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
‘అన్నవరం’పై ప్రత్యేక దృష్టి
అన్నవరం సత్యదేవుని సన్నిధికి వస్తున్న భక్తులు సంతృప్తి చెందేలా సేవలందించడంలో దేవస్థానం విఫలమవుతున్న విషయం ఐదు నెలలుగా జరుగుతున్న సర్వేల్లో వెల్లడవుతోంది. గత మే నెలలో వచ్చిన భక్తుల్లో 35 శాతం మందికి పైగా దేవస్థానంలో ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏప్రిల్ 30 నుంచి మే 25వ తేదీ వరకూ నిర్వహించిన సర్వేలో సత్యదేవుని దర్శనం విషయంలో 68 శాతం మంది మాత్రమే సంతృప్తి చెందారు. 32 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మౌలిక వసతుల కల్పనలో 61 శాతం మంది సంతృప్తి, 39 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వామివారి గోధుమ నూక ప్రసాదం నాణ్యతపై 78 శాతం మంది సంతృప్తి, 22 శాతం మంది అసంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించారు. పారిశుధ్యంపై 64 శాతం మంది సంతృప్తి, 36 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల అసంతృప్తి నేపథ్యంలో కమిషనర్ ప్రత్యేకాధికారులను నియమించారు. ఇకనైనా దేవస్థానంలో పరిస్థితులు మెరుగుపడాలని భక్తులు కోరుతున్నారు.
అన్నవరం దేవస్థానం
అసంతృప్తిపై దిద్దుబాట
అసంతృప్తిపై దిద్దుబాట


