రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: రత్నగిరికి ఆదివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. సత్యదేవుని ఆలయ ప్రాంగణం, క్యూ లైన్లు, వ్రత, విశ్రాంతి మండపాలు నవ దంపతులు, వారి బంధుమిత్రులతో కిక్కిరిసిపోయాయి. సాయంత్రం వరకూ రద్దీ కొనసాగింది. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించి, పూజలు చేశారని అధికారులు తెలిపారు. వ్రతాలు 2,100 జరిగాయి. ఉచిత దర్శనానికి గంట, ప్రదక్షిణ దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, పూజలు చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఉదయం నుంచీ వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పశ్చిమ రాజగోపురం వద్ద చలువ పందిళ్ల నుంచి, ఆలయ ప్రాకారం చుట్టూ ఉన్న గ్రీన్ షేడ్ నుంచి వాన నీరు ధారగా కారడంతో భక్తులు పూర్తిగా తడిసిపోయారు. మధ్యాహ్నం నుంచి వర్షం తగ్గింది. వర్షం కారణంగా సత్యదేవుడు, అమ్మవారి పల్లకీ సేవ ఆలయం లోపలి ప్రాకారంలో నిర్వహించారు.
లోవలో భక్తుల రద్దీ
తుని: లోవ దేవస్థానానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 30 వేల మంది భక్తులు తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి విశ్వనాథరాజు తెలిపారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,48,460, పూజా టికెట్లకు రూ.2,15,550, కేశఖండన టికెట్లకు రూ.27,600, వాహన పూజ టికెట్లకు రూ.6,170, కాటేజీలకు రూ.92,792, డొనేషన్లుగా రూ.1,27,118 కలిపి రూ.7,17,690 ఆదాయం సమకూరిందని వివరించారు.
భళీ.. నృత్యకేళి
● ముగిసిన అంతర్జాతీయ
కళా సమ్మేళన్–2025
● ప్రతిభ చూపిన 13 బృందాలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): తెలుగు సంస్కృతీ వైభవానికి కేంద్రమైన రాజమహేంద్రవరంలో.. గోదావరి తీరాన కళాభిమానులు నాలు గు రోజుల పాటు సంగీత, నృత్యానందఝరుల్లో ఓలలాడారు. శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం ఆధ్వర్యాన స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో గురువారం ప్రారంభమైన కళా సమ్మేళన్–2025 అంతర్జాతీయ సంగీత, నృత్యోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. దేశంలోని 13 రాష్ట్రాలతో పాటు మలేషియా నుంచి వచ్చిన 750 మంది కళాకారులు 13 బృందాలుగా ఈ సంగీత, నృత్య పోటీల్లో పాల్గొని, కళాభిమానులకు నేత్రానందాన్ని కలిగించారు. తొలి రోజు వంద మంది నృత్యకారిణులు పురివిప్పిన మయూరాల్లా నర్తించి, వీక్షకులను అలరించారు. రెండో రోజున శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం ఆధ్వర్యాన ఉదయం 9 గంటల 9 నిమిషాల 9 సెకెన్లకు గురువాష్టకం, మీనాక్షీ పంచరత్న స్తోత్రాలకు ఏకధాటిగా సాయంత్రం 6 గంటల వరకూ నర్తించారు. దీనికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ పినాకిల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వరించాయి. మూడో రోజైన శనివారం ప్రదర్శించిన డ్యాన్స్ బాలేకి ఉత్తర ప్రదేశ్ మాజీ మంత్రి వినోద్ త్యాగి, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గోపాల్ అగర్వాల్ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. చివరి రోజైన ఆదివారం జూనియర్, సబ్ జూనియర్ కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. రాజమహేంద్రవరం శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం నృత్యకారులు ప్రదర్శించిన రుక్మిణీ కల్యాణానికి ఈ పోటీల్లో ప్రథమ బహుమతి లభించింది. హైదరాబాద్ కళాకారులు ప్రదర్శించిన గోదా కళ్యాణానికి ద్వితీయ, గుడివాడ బృందం ప్రదర్శించిన నవదుర్గలకు తృతీయ బహుమతులు లభించాయి. వీటితో పాటు అయ్యప్ప మాహాత్మ్యం, పార్వతీ కల్యాణం, మోహినీ భస్మాసుర, కృష్ణలీలలు, శ్రీనివాస కల్యాణం, సనాతన శక్తి వైభవం, నమో వెంకటేశాయ, గోదా కల్యాణం తదితర ప్రదర్శనలకు సర్టిఫికెట్లు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి.
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
రత్నగిరికి పోటెత్తిన భక్తులు


