
ఇటీవలే శుభకార్యం.. అంతలోనే విషాదం..
రాయవరం: ఆ కుటుంబంలోని పెద్ద కుమార్తె ఓణీల ఫంక్షన్‌ను రెండు రోజుల క్రితమే ఎంతో ఘనంగా నిర్వహించారు. బంధువులు, స్నేహితులతో కలిసి కుటుంబ సభ్యులు ఆనందంగా గడిపారు. అక్క ఫంక్షన్‌లో చిన్న కుమార్తె ఎంతో సందడి చేసింది. రెండు రోజులు అవకుండానే ఆ బాలికను ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. శుభకార్యం జరిగిన ఇంటిలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే.. అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామానికి చెందిన పాలపర్తి వీర వెంకట సత్యనారాయణ, ఉమా మహేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఓణీల ఫంక్షన్‌ను రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో నిర్వహించారు. వీఆర్‌ఏగా విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణ ఇంట శుభకార్యం జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఇంకా ఇంట్లోనే ఉన్నారు. కాగా.. సత్యనారాయణ వరసకు మేనల్లుడైన నెల్లూరుకు చెందిన పవన్ సత్యస్వరూప్ గురువారం సత్యనారాయణ రెండో కుమార్తె నాగవర్షిణి (11)ని మోటార్ సైకిల్‌పై ఎక్కించుకుని రాయవరం వచ్చాడు. లొల్ల వైపునకు వెళ్లిన వీరు తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేయబోయారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురయ్యారు. నాగవర్షిణిపై నుంచి ట్రాక్టర్ తొట్టె వెనుక చక్రాల వెళ్లిపోవడంతో తీవ్రంగా గాయపడింది. పవన్ సత్య స్వరూప్ స్పల్ప గాయాలతో బయటపడ్డాడు.
విలవిల్లాడిన బాలిక
ట్రాక్టర్ చక్రాలు ఎక్కేయడంతో తీవ్రంగా గాయపడిన నాగవర్షిణి విలవిలలాడింది. ఆమె వద్దకు వెళ్లడానికి ఎవ్వరూ సాహసించలేదు. సుమారు పావుగంట తర్వాత సమీపంలోని ఫొటో స్టూడియో నిర్వాహకుడు కారంపూడి సత్తిబాబు అక్కడకు వచ్చి బాలిక శరీరంపై క్లాత్‌ను కప్పాడు. ఆ తర్వాత స్థానికులు వచ్చి సాయమందించారు.
ఘటనా స్థలానికి పోలీసులు
ప్రమాదం జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న రాయవరం ఎస్సై డి.సురేష్ బాబు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలికను 108లో రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మండపేటకు తీసుకువెళ్లారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. సంఘటనా స్థలాన్ని మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్‌బాబు తెలిపారు.
ట్రాక్టర్ ఢీకొని బాలిక మృతి
రాయవరంలో ఘటన

ఇటీవలే శుభకార్యం.. అంతలోనే విషాదం..