
సరిగా ఆడిట్ చేయకుంటే మెమో
కాకినాడ సిటీ: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ద్వారా వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి అందిన అర్జీలను గ్రీవెన్స్ అధికారి మాత్రమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు అధికారులను ఆదేశించారు. కాకినాడ కార్యాలయంలోని వివేకానంద హాలులో జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంపై బుధవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో డీఎల్‌డీవో వాసుదేవరావు, హౌసింగ్ పీడీ ఎన్‌వీవీ సత్యనారాయణలతో కలిసి డీఆర్వో గ్రీవెన్స్ దరఖాస్తులు పరిష్కారం చేసే విధానంపై పలు సూచనలు చేశారు. సమస్యను గ్రీవెన్స్ దారు సంతృప్తి పొందే విధంగా పరిష్కరించాలని ఆదేశించారు. పరిష్కరించిన గ్రీవెన్స్‌లను జిల్లా స్థాయి అధికారి మొదటి సారి ఆడిట్ చేస్తారని, దానిని జిల్లా స్థాయి కమిటీ రెండవసారి ఆడిట్ చేస్తుందని ఆ సమస్యను సక్రమంగా పరిష్కరించకపోతే సంబంధిత అధికారికి మెమో జరీ చేస్తామని తెలిపారు. దానిపై జిల్లా అధికారి సక్రమంగా ఆడిట్ చేయకపోతే ఆ జిల్లా అధికారికి కూడా మెమో జారీ చేస్తామని తెలిపారు.
జగనన్న కాలనీలో
ట్రాన్స్‌ఫార్మర్ల తొలగింపు
స్థానికుల ఆందోళన
జగ్గంపేట: స్థానిక జగనన్న కాలనీలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఐదు అధికారులు తొలగించడంపై స్థానికుల నుంచి నిరసన వ్యక్తమైంది. దీనితో జగనన్నకాలనీ వాసులు ఈ విషయాన్ని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి తోట నరసింహానికి, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు తెలియజేశారు. దీంతోవారు జగ్గంపేట విద్యుత్ డీఈ వీరభధ్రరావుతో మాట్లాడి ట్రాన్స్‌ఫార్మర్లు జగనన్నకాలనీలో వున్నవి తీయడం సరికాదని తెలిపారు. అయితే వేసవి కారణంగా గ్రామంలో పలుచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు పనిచేయకపోవడంతో జగనన్న కాలనీలో ప్రస్తుతం ఉపయోగించని ట్రాన్స్‌ఫార్మర్లు మారుస్తున్నామని విద్యుత్ డీఈ వారికి వివరించారు. జగ్గంపేట గ్రామంలో రెండు రోజులుగా ఎండవేడిమికి పలుచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, పాడైపోవడంతో పలు కాలనీలలో విద్యుత్ సరఫరా లేక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడానికి జగనన్న కాలనీలో ట్రాన్స్‌ఫార్మర్లు వాడుతున్నట్లు, కొత్తవి వచ్చిన వెంటనే జగనన్న కాలనీలో యథావిధిగా ఏర్పాటు చేస్తామని విద్యుత్ అధికారులు తెలిపారు.
పాలిసెట్–25లో
94.06 శాతం ఉత్తీర్ణత
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పాలిసెట్–15 ఫలితాల్లో కాకినాడ జిల్లా 94.06 శాతం ఉత్తీర్ణత సాఽధించింది. గత నెల 30వ తేదీన కాకినాడ, పిఠాపురం కలిపి 28 కేంద్రాల్లో 8,849 మంది పరీక్షలు రాయగా వీరిలో 8.371 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 5,212 మందికిగాను 4,865 మంది ఉత్తీర్ణులు కాగా బాలికలు 3,637కుగాను 3,506 మంది ఉత్తీర్ణత సాఽధించారు. కాకినాడకు చెందిన కొప్పిశెట్టి అభిజత్ 15వ ర్యాంక్, ఏ.సత్యసూర్యతేజ 25వ ర్యాంక్, సి.కృష్ణరామవర్షిత్ 34వ ర్యాంక్ సాధించారు.
కిక్కిరిసిన
విఘ్నేశ్వరుని సన్నిధి
అయినవిల్లి: విఘ్నేశ్వరస్వామివారిని బుధవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ జరిపారు. ఆర్చకులు స్వామిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామికి మహానివేదన చేశారు. రాత్రి ఎనిమిది గంటలకు విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. ఆదివారం స్వామివారికి పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.1,96,054 ఆదాయం లభించినట్లు ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.

సరిగా ఆడిట్ చేయకుంటే మెమో