
రైలు నుంచి జారిపడి యువకుడి మృతి
తుని: రైలు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జీఆర్పీ ఎస్సై జీ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం..తుని–హంసవరం రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి 20 నుంచి 25 సంవత్సరాల వయసు కలిగిన యువకుడు మృతి చెందాడు. మృతుడు నలుపురంగు ట్రాక్ ధరించి ఉన్నాడు. చేతిపై శ్రావణి అనే పచ్చబొట్టు ఉంది. మృతుడి దగ్గర ఇతర ఏ ఆధారాలూ లభించలేదు. మృతుడి వివరాలు తెలిసిన వారు 94906 19020 నంబరులో సంప్రదించవచ్చన్నారు.
ఏలూరులో కలవచర్ల మహిళ...
రాజానగరం: భర్తతో కోపంతో పుట్టింటికి వెళ్లిన మహిళ ఊహించని ప్రమాదానికి గురై అందరికీ దూరమైంది. తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ వెళ్తున్న మండలంలోని కలవచర్లకు చెందిన బొమ్మోతు కుమారి (40) ప్రమాదవశాత్తూ కాలు జారి పడిపోవడంతో మృతిచెందింది. ఏలూరు రైల్వే స్టేషను సమీపంలో మంగళవారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలావున్నాయి. మండలంలోని ముక్కినాడకు చెందిన కుమారికి కలవచర్లకు చెందిన ఏసుతో వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం కాగా, కుమార్తెకు వివాహం చేశారు. ఈ క్రమంలో కుటుంబ పరంగా భార్యాభర్తల నడుమ ఏర్పడిన గొడవలతో కుమారి కోపంతో తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఆమె తల్లిదండ్రులు మండెల సత్యనారాయణ, పాపలు పనుల కోసం హైదరాబాద్‌కి పయనమవడంతో వారితోపాటు తాను కూడా గౌతమీ ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరింది. డోరులో నిలబడివున్న ఆమె ఏలూరు సమీపంలోకి వచ్చే సరికి ప్రమాదానికి గురైంది. వెంటనే ఆమెను రైల్వే పోలీసులు ఏలూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త ఏసు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి, మృతురాలిని తన భార్యగా నిర్ధారించాడు. కేసును ఏలూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.