
మండు వేసవిలోనూ లోవకు భక్తుల తాకిడి
తుని రూరల్: మండు వేసవిలోనూ తలుపులమ్మ అమ్మవారి సన్నిధి వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన 30 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని డిప్యూటీ కమిషనర్ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,24,140, పూజా టికెట్లకు రూ.73 వేలు, కేశఖండన శాలకు రూ.16,130, వాహన పూజలకు రూ.9,860, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలుగా రూ.63,772, విరాళాలు రూ.77,577 కలిపి మొత్తం రూ.3,64,479 ఆదాయం సమకూరిందని వివరించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా వేద పండితులు, ప్రధానార్చకులు అమ్మవారికి పంచామృతాభి షేకాలు నిర్వహించారు.
రత్నగిరిపై భక్తజన ప్రవాహం
అన్నవరం: వేలాదిగా తరలివచ్చిన భక్తులతో రత్నగిరి ఆదివారం భక్తజన ప్రవాహాన్ని తలపించింది. కొండపై ఎక్కడ చూసినా భక్తులు గుంపులు గుంపులుగా కనిపించారు. రత్నగిరిపై, ఇతర ప్రాంతాల్లో శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయంలో తీవ్ర రద్దీ నెలకొంది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని 50 వేల మంది దర్శించుకున్నారు. వ్రతాలు 2 వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 6 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు.
ఎండ వేడికి అల్లాడుతున్న భక్తులు
సత్యదేవుని దర్శనానికి, వ్రతాలు ఆచరించేందుకు వస్తున్న భక్తులు రత్నగిరిపై ఎండవేడికి అల్లాడిపోతున్నారు. ఆదివారం 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రత నమోదవడంతో భక్తులు ఆలయ ప్రాంగణంలోని చలువ పందిళ్ల కింద సేద తీరారు. విపరీతమైన ఉక్కపోతతో ఆపసోపాలు పడ్డారు. గతంలో పశ్చిమ రాజగోపురం వద్ద కూడా మజ్జిగ పంపిణీ చేసేవారు. ఈ ఏడాది ఎందుకనో పంపిణీ చేయడం లేదు. దీంతో భక్తులు శీతలపానీయీలను కొనుగోలు చేసి తాగాల్సి వస్తోంది. దేవస్థానం తరఫున భక్తులకు మజ్జిగ పంపిణీ చేయాలని పలువురు సూచిస్తున్నారు.

మండు వేసవిలోనూ లోవకు భక్తుల తాకిడి