
దయార్ద్ర హృదయాలకు ధన్యవాదాలు
● తల్లీబిడ్డల రక్షణలో సత్వర స్పందనకు అభినందనలు
● డీసీపీయూ బృందానికి కలెక్టర్ సత్కారం
● సమాచారం ఇచ్చిన పరమేశ్వర్‌కు భరోసా
కాకినాడ క్రైం: జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పరిధిలో బాలల సంరక్షణ కోసం పని చేస్తున్న డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (డీసీపీయూ) బృందాన్ని కలెక్టర్ షణ్మోహన్ కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో గురువారం ఘనంగా సత్కరించారు. ఈ నెల 20న కాకినాడ బస్టాండ్ ఆవరణలో నిస్సహాయ స్థితిలో హోరు వానలో తడిసి ముద్దవుతూ, రోడ్డుపై ఆకలితో దీనస్థితిలో రోదిస్తున్న తల్లి రామలక్ష్మిని, నాలుగేళ్లు, రెండేళ్లు, రెండు నెలలు వయసున్న ముగ్గురు పిల్లలను ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. అక్కడే ఉన్న కె.గంగవరం మండలం కుందూరు సావరానికి చెందిన కాకినాడ ప్రభుత్వ ఐటీఐ విద్యార్థి వనుము పరమేశ్వర్, మత్స్యకారుడు రాజు వెంటనే స్పందించారు. డీసీపీయూ ప్రొటెక్షన్ ఆఫీసర్ జె.విజయకు సమాచారం అందించారు. తన బృందంతో విజయ సకాలంలో వచ్చి, బాధితులను ఆసుపత్రిలో చేర్చి, అక్కడి నుంచి జీజీహెచ్‌లోని సఖి వన్‌స్టాప్ సెంటర్‌కు తరలించారు. అక్కడే వారికి వసతి కల్పించి, సంరక్షిస్తున్నారు. ఈ సంఘటనపై ‘నా బిడ్డల్ని రక్షించండి’ శీర్షికన ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి కలెక్టర్ షణ్మోహన్ స్పందించారు. తల్లీబిడ్డల దయనీయ స్థితి తెలుసుకుని చలించిపోయారు. వారిని సకాలంలో రక్షించిన విజయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థి పరమేశ్వర్‌తో పాటు డీసీపీయూ సిబ్బందిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఇదే నిబద్ధత కొనసాగించి, తద్వారా జిల్లాకు మరింత మంచి పేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు. విజయ మాట్లాడుతూ, పీడీ విజయకుమారి, డీసీపీవో వెంకట్‌ల ప్రోత్సాహంతో విధి నిర్వహణలో గుర్తింపు పొందే రీతిలో రాణించగలుగుతున్నామని కలెక్టర్‌కు వివరించారు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతం కాకపోతే తనను సంప్రదించాలని ఈ సమాచారం ఇచ్చిన విద్యార్థి పరమేశ్వర్‌కు కలెక్టర్ భరోసా ఇచ్చారు.

దయార్ద్ర హృదయాలకు ధన్యవాదాలు