
జగన్‌పై కోపం.. ప్రజలపై కక్ష
● చంద్రబాబు పాలనలో కళ తప్పిన గ్రామాలు
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
దాడిశెట్టి రాజా
కాకినాడ రూరల్: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కోపంతో ప్రజలపై కక్ష తీర్చుకున్నట్లుగా చంద్రబాబు పరిపాలన ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. స్థానిక వైద్య నగర్‌లోని మాజీ మంత్రి, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు నివాసంలో గురువారం జరిగిన నియోజకవర్గ కో ఆర్డినేటర్ల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్సీ దాట్ల సూర్యనారాయణరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తుని, కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్లు దాడిశెట్టి రాజా, కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, వంగా గీత, ముద్రగడ గిరిబాబు హాజరయ్యారు. జిల్లాలో పార్టీ పటిష్టత, కమిటీల ఏర్పాటు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రజల ఇబ్బందులు తదితర అంశాలపై నేతలు చర్చించారు. పార్టీ ప్లీనరీ సమావేశాల నాటికి బూత్ స్థాయిలో పార్టీ పటిష్టతకు తీసుకోవలసిన చర్యలపై సమాలోచనలు చేశారు. అనంతరం దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రైతుభరోసా కేంద్రాలు (ఆర్‌బీకే), హెల్త్ సెంటర్లు, కనీసం సచివాలయాలు కూడా పూర్తి స్థాయిలో పని చేయక గ్రామాలు కళ తప్పాయని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 1.20 కోట్లు, జిల్లాలో సుమారు 6 లక్షల కార్డులు ఉన్నాయన్నారు. ఇంటింటికీ రేషన్ అందించే ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థను రద్దు చేయడంతో వారు ఉపాధి కోల్పోయారని, ప్రజలకు మళ్లీ రేషన్ కష్టాలు తప్పవని చెప్పారు. ఆరోగ్యశ్రీ సేవలు అందడం లేదన్నారు. ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు, రైతులకు ఉపయోగపడే ఆర్‌బీకేలు తొలగించి, ఇది మంచి ప్రభుత్వమంటూ వారి మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.
నెలాఖరుకు కమిటీలు
వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు మాట్లాడుతూ, జిల్లాలో 95 శాతం కమిటీలు ఇప్పటికే ఏర్పాటయ్యాయని, మిగిలిన 5 శాతం ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామని చెప్పారు. జూన్, జూలై నెలల్లో నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి, మండల కమిటీల ఆధ్వర్యాన గ్రామ, బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయితే పార్టీ తరఫున రాష్ట్రంలో 18 లక్షల మంది వలంటీర్లు ఉంటారని, వారందరికీ డిసెంబర్‌లోగా గుర్తింపు కార్డులు జారీ అవుతాయని చెప్పారు.