
రత్నగిరిపై భక్తుల సందడి
అన్నవరం: రత్నగిరికి గురువారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున రత్నగిరితో పాటు వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు అధిక సంఖ్యలో సత్యదేవుని దర్శనానికి వచ్చారు. ఆలయ ప్రాంగణం, క్యూ లైన్లు, వ్రత, విశ్రాంత మండపాలు నవదంపతులు, భక్తులతో కిక్కిరిసిపోయాయి. సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. సుమారు 30 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. వ్రతాలు 2 వేలు జరిగాయి. ఉచిత దర్శనానికి గంట, ప్రదక్షిణ దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, పూజలు చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరుడు నిజరూపంలో దర్శనమిచ్చారు. రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి చండీహోమం నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న భక్తులు రూ.750 టికెట్టుతో హోమంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.
ఈఏపీ సెట్‌కు
96.32 శాతం హాజరు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఈఏసీ సెట్ ఆన్‌లైన్ పరీక్ష జిల్లాలో గురువారం ప్రశాంతంగా జరిగింది. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి నిర్వహించిన పరీక్షకు 1,736 మంది హాజరు కాగా, 63 మంది గైర్హాజరయ్యారు. ఉదయ పరీక్షకు 871 మంది హాజరవగా 30 మంది గైర్హాజరయ్యారని, మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 865 మంది హాజరు కాగా, 33 మంది గైర్హాజరయ్యారని కన్వీనర్ వీవీ సుబ్బారావు తెలిపారు.