
పట్టణవాసికి.. పన్నుపోటు!
ఉమ్మడి జిల్లాలో పన్ను వసూళ్ల డిమాండ్ (రూ.కోట్లలో)
నగరం/పట్టణం పన్ను డిమాండ్
కాకినాడ 110.99
పిఠాపురం 10.17
సామర్లకోట 8.78
రాజమహేంద్రవరం 137.32
నిడదవోలు 8.47
ఏలేశ్వరం 2.61
అమలాపురం 14.72
రామచంద్రపురం 7.65
పెద్దాపురం 7.18
కొవ్వూరు 4.56
సాక్షి, రాజమహేంద్రవరం: సంపద సృష్టించి, సంక్షేమం అమలు చేస్తామని ఎన్నికల్లో గొప్పలు చెప్పిన కూటమి పెద్దలు.. అధికారం చేపట్టినప్పటి నుంచీ బాదుడుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ చార్జీలు పెంచి, ప్రజలకు పెను భారం మోపిన సర్కారు.. తాజాగా నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆస్తి, ఇంటి, ఖాళీ స్థల, కుళాయి పన్నులు పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. ఇది చాలదన్నట్లు ప్రస్తుతం 15 శాతం చెల్లిస్తున్న ఆస్తి పన్నును 20 శాతానికి పెంచేందుకు మార్గదర్శకాలు రూపొందించి, అమలు చేస్తోంది. పురపాలక సంస్థల్లో చాలా ఆస్తులకు అసెస్‌మెంట్ చేయలేదని, దీనికోసం సర్వే చేపడుతున్నామని నమ్మబలుకుతోంది. కానీ, ప్రజలకు ‘అదనపు వడ్డింపు’లు చేయడమే దీని వెనుక అసలు లక్ష్యమనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత డిమాండ్ కంటే కనీసం 20 శాతం అధికంగా పన్నులు వసూలు చేయాలని ఇటీవల విడుదల చేసిన ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు అధికారులు సర్వే పనుల్లో తలమునకలవుతున్నారు.
ఇదేనా సంపద సృష్టి?
కూటమి అధికారంలోకి వస్తే ఏటా పెంచే 15 శాతం పన్నును తగ్గిస్తామని కూటమి నేతలు ఎన్నికల్లో హామీలు గుప్పించారు. గత ప్రభుత్వం పట్టణ ప్రజలపై పన్నుల భారం పెంచిందని, తాము అధికారంలోకి రాగానే మదింపు చర్యలు చేపడతామని తప్పుడు ప్రచారం చేస్తూ అధికార పగ్గాలు చేజిక్కించుకున్నారు. గద్దెనెక్కిన కొన్ని నెలల వ్యవధిలోనే కూటమి పెద్దలు ప్రజల నడ్డి విరిచే చర్యలు చేపడుతున్నారు. ఏదైనా భవనానికి నిర్మాణ సమయంలోనే కొలతలు, నిర్మాణానికి అనుమతులు తీసుకుంటారు. నిర్మాణం పూర్తయ్యాక మున్సిపల్ సిబ్బంది సర్వే చేసి, పన్ను విధిస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. ఇందులో లోపాలున్నాయంటూ తప్పుడు ప్రచారానికి దిగిన ప్రభుత్వం.. తాజాగా కొలతలు తీసుకోవాలని పేర్కొంటూ, కొత్తగా పన్ను భారాలు మోపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో వచ్చే నెల 15వ తేదీ నాటికి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి, ఆస్తుల కొలతలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రస్తుతం చెల్లిస్తున్న ఆస్తి పన్నుకు మరో 20 శాతం అదనంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసేందుకు నాంది పలుకుతోంది. ఈ మేరకు పురపాలక సంఘాలకు ఆదేశాలు జారీ చేసింది. ఏ పట్టణ స్థానిక సంస్థలో ఎంత మేర అదనంగా వసూలు చేయాలో ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. కూటమి అధికార పగ్గాలు చేపట్టాక మోపుతున్న భారాలను చూస్తూంటే.. సంపద సృష్టి అంటే ఇదేనా బాబు గారూ.. అంటూ ప్రజలు నిట్టూరుస్తున్నారు.
ఇంటింటి సర్వే చేస్తారిలా..
● సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించేందుకు రెవెన్యూ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. సచివాలయ కార్యదర్శులు, రెవెన్యూ, సర్వేయర్ల సహాయంతో ఈ సర్వే చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రతి విషయాన్నీ నిశితంగా పరిశీలిస్తారు.
● ఇళ్లు, భవనాలున్నవారు ఆస్తి పన్ను చెల్లిస్తున్నారా, లేదా తనిఖీ చేస్తారు. ఆస్తి, కుళాయి, ఖాళీ స్థలాల పన్నులపై ప్రత్యేకంగా పరిశీలిస్తారు.
● నిర్మాణ విస్తీర్ణం మేరకు పన్ను విధించారా, లేదా.. అదనపు అంతస్తులకు పన్ను విధించారా.. నివాస భవనాలను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారా.. అనే అంశాలపై క్షేత్ర స్థాయిలో ఆరా తీస్తారు.
బాదుడు ఇలా..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా రాజమహేంద్రవరం, కాకినాడ నగరపాలక సంస్థలు, 9 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీలు ఉన్నాయి. ఏటా సుమారు రూ.307.89 కోట్ల పన్ను డిమాండ్ ఇక్కడ ఉంది. తాజా ‘పన్ను పోటు’లో కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల ప్రజలపై అత్యధిక భారం పడనుంంది. రాజమహేంద్రవరంలో అత్యధికంగా రూ.137.32 కోట్ల డిమాండ్ ఉంటోంది. సర్వే పూర్తయితే ఇక్కడి ప్రజలపై మరో రూ.15 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. కాకినాడ కార్పొరేషన్‌లో పన్నుల డిమాండ్ రూ.110.99 కోట్లు కాగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వ బాదుడుతో ఈ నగర ప్రజలపై మరో రూ.12 కోట్లు వడ్డిస్తారు.
అదనపు వసూళ్లకు కూటమి
సర్కార్ గ్రీన్ సిగ్నల్
వచ్చే నెల 15లోగా ఇంటింటికీ వెళ్లి కొలతలు తీయాలని ఆదేశాలు
రాజమహేంద్రవరంలో రూ.15 కోట్లు.. కాకినాడలో రూ.12 కోట్ల భారం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు రూ.40 కోట్ల వడ్డింపు