● నాగాంజలి మృతికి సంతాపం
● బాధితులను ప్రభుత్వ పెద్దలు
ఎందుకు పరామర్శించలేదు?
● వైఎస్సార్ సీపీ నేత నాగమణి
కాకినాడ రూరల్: ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతికి కారకుడైన కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి ఏజీఎం దీపక్‌ను, ఇతర దోషులందరినీ కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జోనల్ కార్యదర్శి జమ్మలమడక నాగమణి డిమాండ్ చేశారు. మృత్యువుతో 12 రోజుల పాటు పోరాడి రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందిన నాగాంజలి కుటుంబానికి పార్టీ తరఫున ఆమె సంతాపం, సానుభూతి తెలిపారు. కాకినాడ కొత్త గైగోలుపాడులోని తన నివాసంలో శుక్రవారం నాగమణి మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, అధికార ప్రతినిధి శ్యామల, తాను ఇటీవల రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగాంజలిని చూశామన్నారు. ఆ తల్లిదండ్రుల బాధ చూస్తే తన మనస్సు చలించిపోయిందన్నారు. మహిళా హోం మంత్రి ఉండి కూడా రాష్ట్రంలో ఆడవారికి రక్షణ లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తరఫున నాగాంజలిని ఆస్పత్రిలో కనీసంగా కూడా పరామర్శించలేదన్నారు. గత వారం సీఎం చంద్రబాబు పోలవరం వచ్చారని, పరామర్శించాలనుకుంటే రాజమహేంద్రవరం అక్కడకు ఎంత దూరమని ప్రశ్నించారు. ఆడపిల్లలపై చేయి వేస్తే తాట తీస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ ఘటనను ఎందుకు ఖండించలేదని నిలదీశారు. సుమారు 30 వేల మంది మహిళలు కనిపించడం లేదని ఎన్నికల ముందు తప్పుడు ప్రచారం చేసిన పవన్.. ఇప్పుడెందుకు మాట్లాడడం లేదన్నారు. వైఎస్సార్ సీపీ వారిపై అక్రమ కేసులు బనాయించడం, అరెస్టు చేసి జైలుకు పంపడమే పరిపాలనని ప్రభుత్వం భావిస్తోందన్నా రు. వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని గుండె సమస్యతో బాధ పడుతూ చికిత్స పొందుతూంటే దానిపై కూడా మంత్రి లోకేష్ సైటెర్లు వేస్తున్నారని దుయ్యబట్టారు. మా రెడ్‌బుక్ చూస్తే ఒకరికి గుండె నొప్పి వస్తుందని, మరొకరికి బాత్‌రూములో చేయి వి రుగుతుందంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి వంటి వారి ని కూడా వెటకారం చేస్తున్నారని మండిపడ్డారు. అ హంకారం తగదని, ప్రజలను రక్షించాలనే లక్ష్యంతోనే పరిపాలన సాగించాలని నాగమణి హితవు పలికారు.


