
రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని
ప్రారంభించిన జేసీ ఇలక్కియా
కాకినాడ సిటీ: రాగిజావతో ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియ విద్యార్థులకు సూచించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా రాగి జావ పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి జాయింట్ కలెక్టర్ ఇలక్కియ దీనికి హాజరయ్యారు. అనంతరం జాయింట్ కలెక్టర్, విద్యాశాఖ అధికారులతో కలిసి విద్యార్థులకు రాగిజావ పంపిణీ చేశారు. జేసీ ఇలక్కియ మాట్లాడుతూ జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా ప్రతి మంగళ, గురు, శనివారాల్లో విద్యార్థులకు రాగి జావ అందించనున్నట్లు తెలిపారు. ఈ రాగి జావతో పిల్లలకు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు అందుతాయన్నారు. వీటితో పాటు బీ కాంప్లెక్స్, విటమిన్ సీ, ఈ, థయామిన్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్ ఉంటాయన్నారు. తద్వారా విద్యార్థులకు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం సొంతమవుతుందన్నారు. రోగనిరోధకశక్తిని పెంచేందుకు, రక్తహీనతను నివారించేందుకు జావ ఉపయోగపడుతుందన్నారు. 1,256 పాఠశాలల్లో 1,62,962 మంది విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పథకం ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ వివరించారు.
విద్యార్థుల ఆరోగ్య సంరక్షణే లక్ష్యం
ఆర్‌జేడీ నాగమణి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తోందన్నారు. ఇప్పటికే పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి నాణ్యత, రుచి పోషకాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. కోడిగుడ్డు, చిక్కీ వంటి అధిక ప్రోటీన్లు, విటమిన్లు ఉండే పదార్ధాలను అందిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజనం తినే విద్యార్థుల సంఖ్య బాగా పెరిగిందన్నారు. వీటితో పాటు విద్యార్థులకు మరిన్ని పోషక విలువలతో కూడిన ఆహారం అందించే లక్ష్యంతో జగనన్న గోరుముద్దలో భాగంగా రుచికరమైన, ఆరోగ్యకరమైన రాగిజావను అందిస్తున్నట్లు నాగమణి చెప్పారు. కార్యక్రమంలో డీఈవో కెఎన్‌విఎస్ అన్నపూర్న, డిప్యూటీ డీఈవో ఆర్‌జే డేనియల్‌రాజు, మధ్యాహ్న భోజన పథకం అసిస్టెంట్ డైరెక్టర్ పి నాగేశ్వరరావు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.