(డెస్క్‌, రాజమహేంద్రవరం).....

- - Sakshi

(డెస్క్‌, రాజమహేంద్రవరం) : విత్తనంలోని లక్షణమే వృక్షానికి సంక్రమించినట్టు పేరులోనే శుభరూపాన్ని ఇముడ్చుకొన్న ‘శోభకృత్‌’ మన ముందుకు అరుదెంచింది. ఇది కాలచక్ర గమనంలో మరో మైలురాయి. ఈ నవ వసంతం అరవై ఏళ్లకోసారి విచ్చేసే అరుదైన కాలరేఖ. మనందరి మనోల్లాస చైత్రగీతిక. సంవత్సరాలకు పేర్లు పెడుతూనే వాటిలో ఒక నిగూఢ సందేశాన్ని ఇమడ్చటం పెద్దల దార్శనికత. గత ఏడాది ‘శుభకృత్‌’ ఆరంభం కావడంలోని ఆలోచనా రమణీయకత, శుభకృత్తును అనుసరించి ‘శోభకృత్‌’ రావడంలోని ఔచిత్యం మన మనసుకు సంతోషాన్ని, వికాసాన్ని కలిగిస్తాయి. అభయాన్ని ప్రసాదిస్తాయి. ప్రభవ నుంచి అక్షయ దాకా అరవై పేర్లతో పునరావృతమయ్యేదే ఉగాది.

కష్టసుఖాల మేళవింపే ఉగాది పచ్చడి

ఉగాది పేరు చెప్పగానే హృదయం ఉత్సాహంతో ఉరకలేస్తుంది. పురాణాల ప్రకారం బ్రహ్మ సృష్టి ఆరంభించిన రోజు ఉగాది. చైత్ర శుద్ధ పాడ్యమితో నవ సంవత్సరం ప్రారంభం అవుతుంది. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి, భావికి దర్పణం పట్టి భవిష్యత్తును తెలిపే పంచాంగం శ్రవణం, కోయిలమ్మల కుహూకుహూ స్వరాలు, పల్లెసీమలు, పట్టణాలు, నగరాల్లో సైతం ఆయా గ్రామ దేవతలకు ఉత్సాహభరిత వాతావరణంలో సంబరాలు.. కవుల కవితాగానాలు.. స్ఫురణకు వస్తాయి. నవ ఉగాది కాలానికి ఆది కనుక యుగాది అయింది. పంచాంగాన్ని పూజించి, ఉగాది పచ్చడి భగవంతునికి నివేదించి స్వీకరిస్తాం. జీవితంలో ఎదురయ్యే అన్ని అనుభవాలను, అనుభూతులను ఉగాది పచ్చడి ఆరు రుచుల్లో ఆవిష్కరిస్తుంది. తీపి, పులుపు, వగరు, కారం, చేదు, ఉప్పు ఈ ఆరు రుచులను మన పెద్దలు ఈ వేడుక వేళ స్వీకరించమన్నారు.

చిన్నబోతున్న ఏరువాక..

తెలుగు సంవత్సరం ఆరంభం నాడు ఏరువాక చేయడం సంప్రదాయం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ సంప్రదాయాన్ని గతంలో రైతులందరూ కచ్చితంగా నిర్వహించేవారు. తొలి పంటకు ఉగాది నాడు శ్రీకారం చుట్టేవారు. పెంట, పేడతో పాటు ఇతర వ్యర్థాలను చేలల్లో వదిలి ఎడ్లకు నాగలి కట్టి దున్నేవారు. ఆ సమయంలో చిన్న మొత్తంలో వెండి, బంగారం భూమిలో వేసేవారు. దీనివల్ల బంగారు పంటలు పండుతాయని నమ్మకం. కాలం గడిచేకొద్దీ కొన్ని ప్రాంతాల్లో ఈ సంప్రదాయం తగ్గింది. డెల్టా చేలల్లో ఒక పంట ఉన్న సమయంలో ఏరువాక తప్పనిసరిగా చేసేవారు. రెండు పంటలు మొదలైన తరువాత కొంతమేర తగ్గించారు. కొబ్బరి తోటలు ఉన్న రైతులు మాత్రం ఏరువాక కొనసాగిస్తున్నారు. మెట్టలో రెండో పంట సాగు చేయని వరి రైతులు ఇప్పటికీ చేస్తున్నారు.

ఆలయాలు ముస్తాబు

ఉగాది పర్వదినం సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి. బుధవారం ఉదయం నుంచే ఆలయాలకు భక్తుల తాకిడి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో శ్రీవారి వైభవాన్ని చాటేలా ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఉభయ దేవేరులతో స్వామివారు ఆలయం నుంచి వెండి శేషవాహనంపై బయల్దేరి ఉగాది మండపం వద్దకు చేరుకుంటారు. అనంతరం మండపంలో శ్రీవారు, అమ్మవార్లను వేంచేయించి, పంచాంగ పఠనం నిర్వహిస్తారు. అన్నవరం సత్యనారాయణస్వామి వారి ఆలయంలోని అనివేటి మండపంలో బుధవారం ఉదయం వేడుకలు ప్రారంభమవుతాయి. స్వామి, అమ్మవార్ల చెంత పంచాంగాలుంచి పూజలు చేస్తారు. అనంతరం పండితులు పంచాంగ పఠనం నిర్వహిస్తారు. కార్యక్రమాలు పూర్తయ్యాక సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని వెండి రథంపై ఊరేగిస్తారు. ఈ సందర్భంగా తూర్పు రాజగోపురం ముందు శోభాయమానంగా పుష్పాలంకరణ చేశారు. కోనసీమ జిల్లాలోని అంతర్వేది, ద్రాక్షారామ, అప్పనపల్లి, అయినవిల్లి, వాడపల్లి తదితర అన్ని ఆలయాలను ఉగాది పర్వదినం సందర్భంగా శోభాయమానంగా ముస్తాబు చేశారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజల అనంతరం పంచాంగ పఠనాలు నిర్వహించనున్నారు.

తెలుగువారి ఆకాంక్షల ప్రతిబింబం

తెలుగువారి మొదటి పండగ ఉగాది. జీవితంలోని సకల అనుభూతుల మిశ్రమంగా ఇంటింటా జరుపుకొనే సంప్రదాయ వేడుక. కాలం నడకలో నవ పథాలు ఆవిష్కరించి తెలుగువారి ఆకాంక్షల ప్రతిబింబమై సుఖ సంతోషాలు కలిగించాలనే ఆశావహ దృక్పథాన్ని ఈ పండగ ఇస్తుంది. జనవరి ఫస్టు పాశ్చాత్య ప్రభావంతో వికృత చేష్టలకు కారణమైతే.. ఉగాది వేళ అలాంటి కార్యక్రమాలకు తావు లేదు. ఏడాదంతా సకల జనులూ సుఖశాంతులు, నూతన కాంతులతో మెరవాలనే ఆకాంక్షల ప్రతిరూపమే ఉగాది. ఎదురుపడిన ప్రతివారికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పండి. ఈ రోజంతా తెలుగులోనే మాట్లాడాలని ప్రతిన పూనండి.

– దాట్ల

దేవదానంరాజు,

కవి, కథకుడు

Read latest Kakinada News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top