
సామర్లకోట: జి.మేడపాడులోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఏటీఎంలో ఈ నెల 15న చోరీకి యత్నించిన నిందితులను అరెస్టు చేశామని సీఐ కె.దుర్గాప్రసాద్ తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ ఘటనపై ఎస్‌బీఐ మేనేజర్ కనిగిరి కృష్ణమౌళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించామన్నారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, డీఎస్పీ సుంకర మురళీమోహన్ సూచనల మేరకు ఏటీఎంలోని సీసీ కెమెరాల ఆధారంగా మండలంలోని జి.కొత్తూరుకు చెందిన రాయి నాగేంద్రబాబు, బెంతుకూర సురేంద్ర ఈ నేరానికి పాల్పడినట్టు గుర్తించామని తెలిపారు. వారిని మంగళవారం అదుపులోకి తీసుకొని విచారించగా, నేరం అంగీకరించారని చెప్పారు. ఈ నెల 15న ఏటీఎంలో రూ.40 లక్షలు పెట్టినట్టు మేనేజరు తెలిపారన్నారు. నిందితులను కాకినాడ స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరు పరచి, రిమాండుకు తరలించామని సీఐ చెప్పారు.

సీఐ దుర్గాప్రసాద్