
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిలో ‘శోభకృత్’ నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సత్యదేవుని ఆలయం, ఆలయప్రాంగణాన్ని పూలమాలలతో శోభాయమానంగా అలంకరిస్తున్నారు. స్వామివారి ఆలయంలోని అనివేటి మండపంలో బుధవారం ఉదయం 8 గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయి. తొమ్మిది గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం పండితులు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. 11 గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని వెండి రథంపై ఆలయ ప్రాకారంలో ఊరేగిస్తారని అధికారులు తెలిపారు. రాత్రికి సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను వెండి రథంపై గ్రామంలోని ఊరేగిస్తారని చెప్పారు. తూర్పు రాజగోపురం ముందు పూలకుండీలతో దాత మట్టే సత్యప్రసాద్ చేసిన పుష్పాలంకరణ అందరినీ ఆకట్టుకుంటోంది.
తూర్పు రాజగోపురం వద్ద
ఆకట్టుకుంటున్న పుష్పాలంకరణ