బదనికలతో రక్షణ | - | Sakshi
Sakshi News home page

బదనికలతో రక్షణ

Mar 21 2023 2:14 AM | Updated on Mar 21 2023 2:14 AM

పురుగుల ఉధృతికి ఎండిపోయిన కొబ్బరి చెట్లు  - Sakshi

పురుగుల ఉధృతికి ఎండిపోయిన కొబ్బరి చెట్లు

మిత్ర పురుగులతో

హానికారక పురుగులకు చెక్‌

కొబ్బరిలో యాజమాన్య పద్ధతులు

పాటించాలి

ఉద్యాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తల సూచన

అంబాజీపేట: కొబ్బరిని ఆశించి, అపారంగా నష్టపరుస్తున్న నల్లముట్టి, ఎర్రముక్కు, ఆకుతేలు, రూగోస్‌ సర్పిలాకార తె ల్లదోమ, బండార్స్‌ తెల్లదోమ వంటి పురుగుల నివారణ మి త్ర పురుగులతోనే సంపూర్ణంగా సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అంబాజీపేట ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన పరిశోధన కేంద్రంలోని జీవనియంత్రణ ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన మిత్ర పురుగులను (బదనికలు) కొబ్బరి తోటల్లో వదలడం ద్వారా హానికారక పురుగుల నివారణ సాధ్యమవుతుందని పరిశోధనల ద్వారా వెల్లడైంది. దీనిపై శాస్త్రవేత్తలు కొబ్బరి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులందరూ ఏక కాలంలో పురుగుల నివారణ చర్యలు చేపడితే చాలావరకూ నియంత్రించవచ్చని చెబుతున్నారు. ఈ మిత్ర పురుగులను స్థానిక పరిశోధన కేంద్రం వద్ద రైతులకు అందిస్తున్నారు.

తెల్లదోమలు

రూగోస్‌ సర్పిలాకార తెల్లదోమ, బొండార్స్‌ తెల్లదోమలు రసం పీల్చే తరగతికి చెందిన రెక్కల పురుగులు. ఆకుల అడుగు భాగాలపై గుడ్లు పెడతాయి. ఈ వలయాలపై తెల్లని మైనపు పూత, వెంట్రుకలు కప్పి ఉంటాయి. ఆకుల అడుగుభాగంలో తెల్లటి దూది వంటి పదార్థం నిండి ఉంటుంది. తేనెలాంటి జిగురు పదా ర్థం ఆకుల అడుగు భాగం నుంచి కింద ఉన్న ఇతర ఆ కులపై పడి, అవి నల్లటి మసిరంగుతో కప్పబడిపోతాయి.

ఎపర్టోక్రైసా ఆస్టర్‌ (మిత్ర పురుగు)

తెల్లదోమ ఉధృతి తక్కువగా ఉన్నప్పుడే ఒక్కో చెట్టుకు ఎపర్టోక్రైసా ఆస్టర్‌ మిత్ర పురుగు గుడ్లు 100 నుంచి 150 లేదా 100 పిల్ల పురుగులు (గ్రబ్స్‌) విడుదల చేయాలి. మధ్యస్థంగా ఉన్నప్పుడు 300 – 500 గుడ్లు లేదా 300 పిల్ల పురుగులు విడుదల చేయాలి. ఈ విధంగా ఎకరాకు కనీసం 10 శాతం మొక్కలకు మిత్ర పురుగులు ఇవ్వాలి.

నల్లముట్టె పురుగు (ఒపిసైనా అరినోసెల్లా)

ఈ పురుగు ఆశించిన ఆకులపై ఎండిన మచ్చలు ఏర్పడతాయి. పురుగు తీవ్రత పెరిగిన కొద్దీ మచ్చలన్నీ కలిసిసోయి, ఆకు మొత్తం ఎండి, వాలిపోతుంది. తెగులు ఎక్కువ ఉధృతంగా ఉన్నప్పుడు కొబ్బరి కాయలు దెబ్బతింటాయి.

బ్రాకాన్‌ బ్రెవికార్నీస్‌ (మిత్ర పురుగు)

తోటలో నల్లముట్టె పురుగు (గొంగళి పురుగు దశలో) ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు,(చెట్టు ఆకులకు పురుగు ఆశించినప్పుడు బ్రెవికార్నీస్‌ మిత్ర పురుగులను ఒక చెట్టుకు 20 చొప్పున విడుదల చేయాలి. ఎకరానికి 10 శాతం మొక్కలకు మిత్ర పురుగులను విడుదల చేయాల్సి ఉంటుంది.

గోనియోజస్‌ నెఫాంటిడిస్‌ (మిత్ర పురుగు)

నల్లముట్టె పురుగు నివారణకు తోటలో ఒక్కో చెట్టుకు గోయియోజస్‌ నెఫాంటిడిస్‌ మిత్ర పురుగులు సుమారు 20 విడుదల చేయాలి. ఈ విధంగా ఎకరానికి కనీసం 10 శాతం మొక్కలకు మిత్ర పురుగులను విడుదల చేయాల్సి ఉంటుంది.

బదనికలతో ఫలితాలు

కొబ్బరిని ఆశించిన పురుగుల ఉధృతిని మిత్ర పురుగులతోనే తగ్గించవచ్చు. పురుగుల నియంత్రణకు యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉధృతంగా ఉన్న కొబ్బరి చెట్లపై మిత్ర పురుగులను ఉపయోగించాలి. శాస్త్రవేత్తల సూచనల మేరకు ఈ బదనికలను వినియోగించడం వల్ల ఫలితాలు పొందవచ్చు. పరిశోధన కేంద్రంలో మిత్ర పురుగులను రైతులకు కనీస ధరకు విక్రయిస్తున్నాం.

– బి.శ్రీనివాసులు, అధిపతి,

ఉద్యాన పరిశోధన కేంద్రం,

అంబాజీపేట

ఆకుతేలు (మాక్రోఫ్లైక్ట్రా నరేరియా)

తొలి దశలో చిన్న గొంగళి పురుగులు ఆకు అడుగున పత్రహరితాన్ని గోకి తినడం వలన ఆకులపై గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. గొంగళి పురుగు ఎదిగిన కొద్దీ ఆకు భాగాన్ని అంచుల నుంచి తిని, ఒట్టి ఈనెలను మాత్రమే మిగుల్చుతాయి. ఎండిన ఆకులు చెట్లకు వేలాడతాయి. ఉధృతంగా ఆశించినప్పుడు కమ్మలు, కాయలపై కూడా ఈ పురుగు ఆశిస్తుంది. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు చెట్ల కింద, చెట్టు చుట్టూ పురుగులు విసర్జించిన రెట్టలు ఒక పొరలా ఏర్పడతాయి. ఆకుతేలు ఆశించిన కొబ్బరి తోటల్లో అంతర పంటగా అరటి మరియు కోకో ఉంటే పురుగు అరటి, కోకోను కూడా ఆశిస్తుంది.

పెడోబియస్‌ ఇంబ్రియస్‌ (మిత్ర పురుగు)

ఆకుతేలు (గొంగళి పురుగు దశలో) నివారణకు తోటలో పెడోబియస్‌ ఇంబ్రియస్‌ 50 మిత్ర పురుగులు ఒక చెట్టుకు విడుదల చేయాలి. కనీసం ఎకరానికి 10 శాతం మొక్కలకు మిత్ర పురుగులను విడుదల చేయాలి.

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement