● నన్నయ వర్సిటీ ప్రశ్నపత్రాల్లో తప్పులు
● డిగ్రీ ఐదో సెమిస్టర్ విద్యార్థులకు తిప్పలు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలో ప్రస్తుతం నిర్వహిస్తున్న డిగ్రీ ఐదో సెమిస్టర్ ప్రశ్నపత్రాల్లో చోటు చేసుకున్న తప్పులు తమకు ముప్పు తెస్తాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. శనివారం జరిగిన గణితం ప్రశ్నపత్రంలో ఒకదానిపై ఒకటి ముద్రపడి (ఓవర్‌లాప్) కొంత గందరగోళం ఏర్పడిన సంగతి విదితమే. అయితే గణితంతో పాటు మేనేజ్‌మెంట్ అకౌంటింగ్, ప్రాక్టీస్ ప్రశ్నపత్రంలోనూ తప్పులు దొర్లాయని వివిధ కళాశాలల ప్రతినిధుల నుంచి అందిన సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇంగ్లిష్‌లో ఇచ్చిన ప్రశ్నలను తెలుగులోకి గూగుల్ ద్వారా అనువదించడంతో అసలైన అర్థాలు మారిపోయాయి. 12వ ప్రశ్నలో ఒక కంపెనీ అకౌంటింగ్‌కి సంబంధించి స్టేట్‌మెంట్ తయారు చేయమని అడిగిన ప్రశ్నలో ఇంగ్లిష్, తెలుగు పదాలకు అర్థాలు లేకుండా పోయాయి. (ఉదాహరణకు అకౌంటింగ్‌లో క్యాపిటల్ అంటే మూలధనం అని అర్థం. కానీ ప్రశ్నపత్రంలో రాజధానిగా ఇచ్చారు. ఇలా ఎన్నో ఉన్నాయి). 10 మార్కుల ప్రశ్నలు 9లో ఏ లేదా బి, 10లో ఏ లేదా బి, 11లో ఏ లేదా బిగా చాయిస్ ఇవ్వాల్సి ఉండగా, వరుసగా 10 ప్రశ్నలు ఇచ్చి వాటిలో ఐదింటికి జవాబు రాయాలని పేర్కొన్నారు. అలాగే 4వ సెమిస్టర్ ఇన్‌కంటాక్స్ పేపరులో కూడా 10 మార్కులకు 5 లెక్కలు/ప్రశ్నలు ఇవ్వాల్సి ఉండగా యూనివర్సిటీ మోడల్ పేపరు ప్రకారం రెండు లెక్కలు/ప్రశ్నలే ఇచ్చారు. పరీక్షలంటేనే హడలిపోయే విద్యార్థులకు ఇది మరింత గందరగోళం కలిగిస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు.
పరిశీలిస్తాం
ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రశ్నల్లో చాయిస్ ఇస్తున్నాం. 2020 బ్యాచ్ వరకే తెలుగు మీడియంలో పరీక్షలు రాసేవారు. 2021 నుంచి అంతా ఇంగ్లిష్ మీడియమే. ఒకే ప్రశ్నను ఇంగ్లిష్, తెలుగులో ఇచ్చే సందర్భంలో అనువాదంలో వస్తున్న తప్పుల గురించి మాకు ఇంతవరకూ ఎటువంటి ఫిర్యాదూ రాలేదు. అయినప్పటికీ ఈ విషయం పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటాం. ఎ లేదా బి విధానానికి బదులుగా 10 ప్రశ్నలిచ్చి, వాటిలో ఐదింటికి జవాబు రాయమనడం వలన విద్యార్థులకు ఎక్కువ చాయిస్ లభిస్తుంది. అయినా ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాను.
– ఎస్.లింగారెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్,
ఆదికవి నన్నయ యూనివర్సిటీ